

కేంద్ర బడ్జెట్ అంటే దేశ ప్రజల్లో ఎన్నో ఆశలు, ఆకాంక్షలు, ఎదురుచూపులు. ఒక ఆర్థిక సంవత్సరంలో దేశ ఆర్థిక దిశను నిర్దేశించే కీలక పత్రం ఇదే. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 1న పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. కేంద్ర బడ్జెట్–2026 సమయం దగ్గరపడుతున్న వేళ, దీనికి సంబంధించిన కొన్ని ఆసక్తికర సాంప్రదాయాలు, చారిత్రక విశేషాలను ఓసారి తెలుసుకుందాం.
భారత్ తొలి బడ్జెట్ ప్రసంగం
స్వాతంత్ర్యం తర్వాత భారతదేశ తొలి కేంద్ర బడ్జెట్‌ను 1947 నవంబర్ 26 న అప్పటి ఆర్థిక మంత్రి ఆర్.కె. షణ్ముఖం చెట్టి ప్రవేశపెట్టారు. అయితే బ్రిటిష్ పాలన కాలంలో భారతదేశ తొలి బడ్జెట్‌ను 1860 ఏప్రిల్ 7న సమర్పించారు. అప్పటి ఆర్థిక మంత్రి జేమ్స్ విల్సన్ ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం విశేషం.
బడ్జెట్ సమయంపై మార్పు
బ్రిటిష్ పాలనలో కేంద్ర బడ్జెట్‌ను సాయంత్రం 5 గంటలకు ప్రవేశపెట్టే సంప్రదాయం ఉండేది. బ్రిటన్ సమయానికి అనుగుణంగా ఈ విధానం కొనసాగింది. అయితే 1999 నుంచి ఉదయం 11 గంటలకు బడ్జెట్ ప్రవేశపెట్టడం ప్రారంభమైంది. మరో ముఖ్యమైన మార్పుగా, 2017 నుంచి ఫిబ్రవరి చివరి రోజు బదులు ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను ప్రవేశపెట్టే విధానం అమల్లోకి వచ్చింది.
హల్వా సాంప్రదాయం
బడ్జెట్‌కు కొన్ని రోజుల ముందు ఆర్థిక మంత్రిత్వ శాఖలో ‘హల్వా వేడుక’ నిర్వహిస్తారు. పెద్ద పాత్రలో హల్వాను తయారు చేసి, బడ్జెట్ రూపకల్పనలో పాల్గొన్న అధికారులకు పంచుతారు. ఈ కార్యక్రమం జరిగితే బడ్జెట్ ముద్రణ ప్రక్రియ ప్రారంభమైందని అర్థం. హల్వా వేడుక అనంతరం అధికారులు ‘లాక్-ఇన్’ కాలంలోకి వెళ్తారు. అంటే బడ్జెట్ ప్రవేశపెట్టే వరకు వారు బయట ప్రపంచంతో ఎలాంటి సంబంధం పెట్టుకోరు.
బ్రీఫ్‌కేస్ నుంచి బహిఖాతా వరకు
గతంలో ఆర్థిక మంత్రులు బడ్జెట్ పత్రాలను లెదర్ బ్రీఫ్‌కేస్‌లో తీసుకువచ్చే వారు. అయితే 2019 లో ఈ సంప్రదాయానికి ముగింపు పలికి, భారతీయ సంప్రదాయానికి ప్రతీకగా ‘బహిఖాతా’ను ప్రవేశపెట్టారు. ఇది ఆధునికతతో పాటు దేశీయ విలువలను ప్రతిబింబించింది.
నిర్మలా సీతారామన్ రికార్డులు
ప్రస్తుత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇప్పటికే వరుసగా అనేక బడ్జెట్లను ప్రవేశపెట్టి ప్రత్యేక రికార్డు సృష్టించారు. కేంద్ర బడ్జెట్–2026 కూడా ఆమె చేతుల మీదుగానే రానుంది. అలాగే, భారతదేశ చరిత్రలోనే అత్యంత పొడవైన బడ్జెట్ ప్రసంగం చేసిన ఘనత కూడా ఆమెకే దక్కింది. 2020 లో ఆమె 2 గంటల 42 నిమిషాల పాటు ప్రసంగించారు. అంతకుముందు 2019 లో 2 గంటల 17 నిమిషాల పాటు ప్రసంగించి, ఆ రికార్డును మరుసటి ఏడాదే తానే బద్దలుకొట్టారు. ఈ విధంగా కేంద్ర బడ్జెట్ కేవలం ఆర్థిక ప్రకటన మాత్రమే కాదు, అనేక సంప్రదాయాలు, చరిత్రతో ముడిపడి ఉన్న ఒక కీలక ఘట్టంగా నిలుస్తోంది.




.avif&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!