

‘పెరుగుట విరుగుట కొరకే’ అనే నానుడి బంగారం మార్కెట్‌కు వర్తించబోతుందా అన్న చర్చ మొదలైంది. పసిడి ధరలు క్షీణించే అవకాశాలపై అంతర్జాతీయ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. ప్రముఖ వార్తా సంస్థ బ్లూమ్‌బర్గ్ ప్రకారం, రష్యా తన అంతర్జాతీయ వాణిజ్య లావాదేవీలను డాలర్లలో సెటిల్ చేయడానికి సిద్ధమవుతోందని సమాచారం వెలువడింది. సాధారణంగా ఇలాంటి కథనాలపై వెంటనే స్పందించే రష్యా ఈ అంశంపై మౌనం పాటించడం గమనార్హం. దీంతో ఈ వార్త నిజమై ఉండవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పసిడి ధరల పతనానికి ఇదే ప్రధాన కారణమని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
గత నెల చివర్లో మల్టీ కమోడిటీస్ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఒక దశలో రూ.1,80,779కు చేరగా, గత శుక్రవారం అది రూ.1,56,200 వద్ద ముగిసింది. బ్లూమ్‌బర్గ్ కథనం నిజమైతే ఫ్యూచర్స్ మార్కెట్లతో పాటు స్పాట్ మార్కెట్లోనూ ధరలు మరింత పడిపోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
బ్రోకరేజ్ సంస్థ పేస్ 360 చీఫ్ గ్లోబల్ స్ట్రాటజిస్ట్ అమిత్ గోయల్ అభిప్రాయం ప్రకారం, దేశీయ మార్కెట్లో ఇప్పటికే బంగారం ధరలు సుమారు 15 శాతం తగ్గాయి. రష్యా డాలర్ల సెటిల్మెంట్కు అధికారికంగా అంగీకరిస్తే ముందుగా గోల్డ్ ఈటీఎఫ్‌లలో భారీగా అమ్మకాలు పెరిగే అవకాశం ఉందని, దాని ప్రభావం ఫిజికల్ గోల్డ్ ధరలపై పడుతుందని తెలిపారు. ఈ పరిస్థితుల్లో వచ్చే ఏడాది చివరికి దేశంలో 10 గ్రాముల బంగారం ధర లక్ష రూపాయల కంటే దిగువకు రావచ్చని, అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్‌కు ధర 3,000 డాలర్ల వరకు పడిపోయే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!