

ఇరాన్ దాడుల కారణంగా ఖతార్ ఎల్ఎన్జీ ఎగుమతులను నిలిపివేయడంతో దేశానికి ఖతార్ నుండి వచ్చే ఎల్ఎన్జీ సరఫరాలు పూర్తిగా నిలిచిపోయాయి. మన దేశానికి అవసరమైన ఎల్ఎన్జీ సరఫరాలో సుమారు 40 శాతం ఖతార్ నుంచి వస్తుంది. తాజా పరిస్థితుల కారణంగా సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు, ఎరువులు, గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్రాజెక్టుల కోసం ఎల్ఎన్జీ సరఫరాలో 40 శాతం కోత విధించాల్సి వచ్చిందని పెట్రోనెట్ ఎల్ఎన్జీ వెల్లడించింది. ఈ పరిణామాల కారణంగా స్పాట్ మార్కెట్లో ఎల్ఎన్జీ ధరలు రెట్టింపు అయ్యాయి. హార్మోజ్ జలసంధి మూసివేత కారణంగా ఎల్ఎన్జీ తీరానికి చేరే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఎవరైనా ఈ అడ్డంకులను అధిగమించి ఎల్ఎన్జీని దిగుమతి చేసుకున్నా, సీజీడీలు, పారిశ్రామిక సంస్థలు కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదు.
వెంటనే వంట గ్యాస్ కొరత సమస్య కూడా ఎదురవుతోంది. దేశంలో వినియోగించే వంట గ్యాస్లో సుమారు 90 శాతం దిగుమతుల ద్వారా సమకూరుతుంది. ముఖ్యంగా సౌదీ అరేబియా, కువైట్, యూఏఈ వంటి దేశాల నుంచి సరఫరా జరుగుతుంది. ఇరాన్ దాడుల కారణంగా ఈ దేశాల నుంచి ఎల్పీజీ దిగుమతులు నిలిచిపోయాయి. ప్రస్తుత నిల్వలు నెల రోజులకు సరిపడే స్థాయిలో ఉన్నాయి. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి అధికార వర్గాలు, ప్రభుత్వం చర్చలు కొనసాగిస్తున్నారు.
అంతర్జాతీయ మార్కెట్లో ఎల్పీజీ ధరలు కొండెక్కాయి. అలాగే గల్ఫ్ దేశాల నుండి ఐదారు రోజుల వ్యవధిలో వచ్చే ఎల్పీజీ నౌకలు, భారత్ చేరడానికి సాధారణంగా ఒక నెల నుంచి ఒక నెలన్నర సమయం పడుతుందని సమాచారం. ప్రభుత్వం ఇతర దేశాలు, ముఖ్యంగా అమెరికా, రష్యా వంటి దేశాల నుంచి ఎల్పీజీ దిగుమతులను విశ్లేషిస్తూ పరిష్కార మార్గాలను పరిశీలిస్తోంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!