

చిరిగిపోయిన లెదర్ జాకెట్లు లేదా ఇతర వస్తువులను మార్చాల్సిన అవసరం లేకుండా, తనంతట తానే మరమ్మతు చేసుకునే ప్రత్యేక లెదర్ను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. పుట్టగొడుగులలో కనిపించే దారంలాంటి నిర్మాణమైన మైసీలియాన్ని ఉపయోగించి ఈ వినూత్న వీగన్ లెదర్ను రూపొందించారు. పర్యావరణహిత ఉత్పత్తుల తయారీలో ఇప్పటికే మైసీలియం వినియోగిస్తున్నప్పటికీ, స్వయంగా పునరుద్ధరించుకునే లక్షణాన్ని అందించడం ఈ పరిశోధనలో కీలక ముందడుగుగా నిలిచింది.
ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు మరియు ఇతర పోషకాలతో కూడిన ప్రత్యేక మిశ్రమంలో మైసీలియాన్ని పెంచి, దానితో లెదర్ తరహా పదార్థాన్ని తయారు చేశారు. ఈ ప్రక్రియలో క్లామిడోస్పోర్స్ అనే సూక్ష్మ నిర్మాణాలను సజీవంగా ఉంచగలిగారు. అనంతరం లెదర్లో రంధ్రాలు చేసి, దానిని పోషకాల ద్రావణంలో ఉంచగా, క్లామిడోస్పోర్స్ మళ్లీ చురుకుగా మారి కొత్త మైసీలియం పెరుగుదలకు దారితీశాయి. ఫలితంగా రంధ్రాలు సహజంగానే మూసుకుపోయి, దెబ్బతిన్న భాగం తిరిగి తన అసలు దృఢత్వాన్ని పొందింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!