

పోటీగా ఉన్న ఏఐ చాట్బాట్లకు వాట్సాప్‌లో ప్రవేశం నిరాకరించడంపై వివాదం చెలరేగింది. మెటా ఆధీనంలోని ఈ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ తీసుకున్న తాజా నిర్ణయాలు యూరోపియన్ యూనియన్ నియంత్రణ సంస్థల దృష్టిని ఆకర్షించాయి. ఈ చర్యలు ఏఐ మార్కెట్లో పోటీని అడ్డుకుంటున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
యూరోపియన్ కమిషన్ మెటాకు తాజాగా హెచ్చరిక జారీ చేస్తూ, ఈ విధానాలు మార్కెట్‌కు “తీవ్రమైన మరియు తిరిగి సరిచేయలేని నష్టం” కలిగించే ప్రమాదం ఉందని పేర్కొంది. ఏఐ అసిస్టెంట్ల రంగంలో కొత్త కంపెనులు ప్రవేశించకుండా లేదా విస్తరించకుండా మెటా చర్యలు అడ్డంకి అవుతున్నాయని కమిషన్ అభిప్రాయపడింది. అవసరమైతే మధ్యంతర చర్యలుగా పోటీ ఏఐ చాట్బాట్లకు వాట్సాప్‌లో అనుమతి ఇవ్వాలన్న ఆదేశాలు జారీ చేసే అవకాశముందని తెలిపింది.
ఈ పరిణామాలు అమెరికా ఆధారిత టెక్ కంపెనీల నియంత్రణ విషయంలో యూరోపియన్ యూనియన్ అమెరికా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఓపెన్ఏఐ, పర్ప్లెక్సిటీ వంటి సంస్థల ఏఐ చాట్బాట్లను వాట్సాప్ నిరోధించడంతో, ప్రస్తుతం ప్లాట్ఫామ్లో మెటా ఏఐ మాత్రమే అందుబాటులో ఉంది. భారత్‌లోనే 500 మిలియన్లకు పైగా వినియోగదారులు ఉన్న వాట్సాప్‌పై ఈ నిర్ణయం గణనీయమైన ప్రభావం చూపనుంది.
గత ఏడాది అక్టోబర్‌లో వాట్సాప్ తన బిజినెస్ ఏపీఐ పాలసీని సవరించి, సాధారణ ప్రయోజనాల కోసం ఉపయోగించే ఏఐ చాట్బాట్లను నిషేధించింది. అయితే కస్టమర్ సర్వీస్ కోసం ఏఐ వినియోగించే వ్యాపారాలు దీనివల్ల ప్రభావితం కావని కంపెనీ స్పష్టం చేసింది. అయినప్పటికీ, స్వతంత్ర ఏఐ అసిస్టెంట్ల పంపిణీపై నిషేధం విధించడం ద్వారా మెటా మరింత క్లోజ్డ్ డిజిటల్ ఎకోసిస్టమ్ వైపు అడుగులు వేస్తోందన్న విమర్శలు పెరుగుతున్నాయి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!