

టీ20 ప్రపంచకప్ 2026లో భారత జట్టుకు టైటిల్ అందించిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, ఆ తర్వాత ఎదుర్కొన్న కఠిన పరిస్థితుల గురించి తాజాగా మనసు విప్పాడు. పేలవ ఫామ్ కారణంగా ప్రపంచకప్ విజయం తర్వాత కొద్ది రోజులకే భారత జట్టులో చోటు కోల్పోవడం తనకు మానసికంగా ఎంతో కష్టంగా అనిపించిందని తెలిపాడు. ముంబైలో నిర్వహించిన ‘టీ20 ముంబై లీగ్ సెలబ్రేటింగ్ ది ఛాంపియన్స్’ కార్యక్రమంలో మాట్లాడిన అతడు, తొలి రెండు నెలలు చాలా కఠినంగా గడిచాయని చెప్పాడు. పరిస్థితులను అంగీకరించి, తనతో తాను నిజాయతీగా ఉండటం ద్వారా ముందుకు సాగగలిగానని వివరించాడు.
ఈ సమయంలో భార్య దేవిషా శెట్టి ఇచ్చిన సలహా తన ఆలోచనా విధానాన్ని మార్చిందని సూర్య వెల్లడించాడు. 15 ఏళ్ల వయసులో క్రికెట్‌పై ఎంత ప్రేమ, ఆసక్తి ఉండేదో మళ్లీ అలాంటి భావనతో ఆడాలని ఆమె సూచించినట్లు తెలిపాడు. ఐపీఎల్ సమయంలో మే నెలలో పాప పుట్టడం కూడా తన జీవితంలో కొత్త ఆనందాన్ని తీసుకొచ్చిందని, క్రికెట్‌లో ఎదురైన నిరాశ నుంచి బయటపడేందుకు సహాయపడిందని చెప్పాడు. ప్రస్తుతం మళ్లీ పాత ఉత్సాహంతో సాధన చేస్తూ ముంబై జట్టును గెలిపించడంపై దృష్టి పెట్టినట్లు వెల్లడించాడు. రంజీ ట్రోఫీ తొలి దశ జట్టులో చోటు దక్కకపోవడంపై స్పందిస్తూ, ఆఫ్ సీజన్ సన్నాహాల్లో పాల్గొనలేకపోవడమే కారణమని వివరించాడు. యువ క్రికెటర్లు ముందుగా తమ నగరం, రాష్ట్రం తరఫున ఆడాలని కలలు కనాలని సూచించాడు. 2010-11లో ముంబై డ్రెస్సింగ్ రూమ్‌లో సచిన్ టెండూల్కర్, అమోల్ మజుందార్, అజిత్ అగార్కర్ వంటి దిగ్గజాలతో గడిపిన తొలి రోజుల జ్ఞాపకాలను కూడా పంచుకున్నాడు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!