

మారథాన్ అత్యంత కఠినమైన పరుగుల పోటీల్లో ఒకటి. సుదీర్ఘంగా సాగే ఈ రేసులో పతకం సాధించడం పెద్ద సవాలు. అలాంటిది ఫుల్ మారథాన్‌లోకి అడుగుపెట్టిన తొలి ఏడాదే ఆసియా క్రీడల్లో రజత పతకం సాధించడం సావన్ బర్వాల్‌ను ప్రత్యేకంగా నిలిపింది. హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి జిల్లాకు చెందిన 28 ఏళ్ల సావన్.. చిన్నప్పటి నుంచే కొండ ప్రాంతాల్లో పెరగడంతో ఎత్తైన ప్రదేశాల్లో పరుగులు, సుదూర ప్రయాణాలకు అలవాటు పడ్డాడు. అథ్లెట్‌గా రాణిస్తూ సైన్యంలో ఉద్యోగం పొందిన ఆయన.. కోచ్ యూనిస్ ఖాన్ సూచనతో మారథాన్‌పై దృష్టి పెట్టాడు. పుణెలోని ఆర్మీ స్పోర్ట్స్ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ పొందాడు. 2024లో దిల్లీ జాతీయ హాఫ్ మారథాన్‌లో స్వర్ణం సాధించడంతో పాటు అదే ఏడాది జాతీయ ఫెడరేషన్ అథ్లెటిక్స్‌లో 10 వేల మీటర్ల విభాగంలోనూ పసిడి గెలిచాడు.
ఈ ఏడాదే ఫుల్ మారథాన్‌లోకి వచ్చిన సావన్.. కోచ్ స్కాట్ సిమన్స్ శిక్షణలో మరింత పట్టు సాధించాడు. ఎన్‌ఎన్ రోటర్‌డామ్ పోటీల్లో 2 గంటల 11 నిమిషాల 58 సెకన్లలో రేసును పూర్తి చేసి, 48 ఏళ్లుగా కొనసాగుతున్న శివనాథ్ పేరిట ఉన్న జాతీయ రికార్డును అధిగమిస్తూ స్వర్ణం సాధించాడు. ఆసియా క్రీడలకు ముందు పెద్దగా అంతర్జాతీయ అనుభవం లేకపోయినా.. జపాన్‌లో జరిగిన ఆసియాడ్‌లో సావన్ అద్భుత ప్రదర్శన చేశాడు. రేసుకు ముందు ఒక అరటిపండు మాత్రమే తీసుకున్న ఆయన.. మధ్య మధ్యలో కొద్దిగా నీరు తాగుతూ రేసును కొనసాగించాడు. జాతీయ రికార్డు వేగంతో మారథాన్‌ను పూర్తి చేసి భారత్‌కు రజత పతకం అందించాడు. విదేశాల్లో జరిగిన ఆసియా క్రీడల్లో భారత్‌కు మారథాన్‌లో లభించిన తొలి పతకంగా ఇది నిలిచింది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!