

లక్ష్య ఛేదనలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని మించిన ఆటగాడు లేడని ఇంగ్లాండ్ మాజీ ఆల్రౌండర్ సమిత్ పటేల్ ప్రశంసించాడు. మ్యాచ్ పరిస్థితులకు అనుగుణంగా బ్యాటింగ్ వేగాన్ని మార్చుకోవడంలో కోహ్లీకి అద్భుతమైన నైపుణ్యం ఉందని కొనియాడాడు. మరోవైపు, రోహిత్ శర్మ దూకుడుగా బ్యాటింగ్ చేయడంతో పాటు నాయకుడిగానూ తన ప్రతిభను నిరూపించుకున్నాడని పేర్కొన్నాడు. భారత అత్యుత్తమ సారథుల్లో రోహిత్ ఒకడని అభిప్రాయపడ్డాడు. వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) 2026 టోర్నీలో భాగంగా మీడియాతో మాట్లాడిన సమిత్ పటేల్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
2027 వన్డే ప్రపంచకప్లో భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా జట్లు సెమీఫైనల్కు చేరే అవకాశాలున్నాయని సమిత్ పటేల్ అంచనా వేశాడు. యువ భారత బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి తగినంత సమయం ఇవ్వాలని సూచించాడు. అతడిలో అపార ప్రతిభ ఉందని, తప్పుల నుంచి నేర్చుకుంటూ ఎదిగేందుకు అవకాశాలు కల్పించాలని అభిప్రాయపడ్డాడు. ఇంగ్లాండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో వైభవ్ తన అంతర్జాతీయ టీ20 కెరీర్లో ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్గా మలిచి అందరినీ ఆశ్చర్యపరిచిన విషయాన్ని పటేల్ ప్రత్యేకంగా ప్రస్తావించాడు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!