

ఐఎఫ్‌ఏ షీల్డ్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో మోహన్ బగాన్ విజేతగా నిలిచింది. గురువారం హోరాహోరీగా సాగిన ఫైనల్ పోరులో ఈస్ట్ బెంగాల్‌పై 1-0తో విజయం సాధించింది. ఇరు జట్లు నువ్వా నేనా అన్నట్లుగా తలపడిన ఈ మ్యాచ్‌లో మోహన్ బగాన్ తరఫున సామిర్ జెల్‌కోవిచ్ కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్ 45వ నిమిషంలో అతను చేసిన ఏకైక గోల్‌తో మోహన్ బగాన్ ఆధిక్యంలోకి వెళ్లింది. తొలి అర్ధభాగం ముగిసే సమయానికి లభించిన ఈ ఆధిక్యం జట్టుకు ఎంతో కీలకంగా మారింది.
వెనుకంజలో ఉన్న ఈస్ట్ బెంగాల్ స్కోరు సమం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ, ప్రత్యర్థి రక్షణను ఛేదించి గోల్ చేయలేకపోయింది. మరోవైపు మోహన్ బగాన్ తమ ఆధిక్యాన్ని చివరి వరకు కాపాడుకుని ప్రతిష్ఠాత్మక టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఈ విజయంతో మోహన్ బగాన్ తన చరిత్రలో 22వసారి ఐఎఫ్‌ఏ షీల్డ్‌ను కైవసం చేసుకుంది. సంప్రదాయ ప్రత్యర్థుల మధ్య జరిగిన ఈ ఫైనల్ పోరు ఫుట్‌బాల్ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించింది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!