

ఐపీఎల్ 2026 లీగ్ దశ కీలక దశకు చేరుకున్న సమయంలో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ పై 4 వికెట్ల తేడాతో గెలిచి ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కేకేఆర్ పవర్‌ప్లేలోనే ముంబై టాప్ ఆర్డర్‌ను కుదేలు చేసింది. కామెరాన్ గ్రీన్, సౌరభ్ దూబే కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ముంబైని 41/4 స్థితిలోకి నెట్టారు. హార్దిక్ పాండ్యా 26, తిలక్ వర్మ 20 పరుగులు చేసినప్పటికీ ముంబై పెద్ద భాగస్వామ్యాలు నెలకొల్పలేకపోయింది. చివర్లో కార్బిన్ బాష్ 18 బంతుల్లో అజేయంగా 32 పరుగులు చేసి ముంబై స్కోరును 147/8కి చేర్చాడు.
148 పరుగుల లక్ష్య ఛేదనలో కేకేఆర్‌కూ ఆరంభంలో ఎదురుదెబ్బలు తగిలాయి. అజింక్య రహానే, కామెరాన్ గ్రీన్ త్వరగా ఔటవడంతో జట్టు ఒత్తిడిలో పడింది. అయితే ఈ సీజన్లో తొలి మ్యాచ్ ఆడుతున్న మనీష్ పాండే అద్భుత ఇన్నింగ్స్ ఆడి జట్టును ఆదుకున్నాడు. అతడు 33 బంతుల్లో 45 పరుగులు చేయగా, రోవ్‌మన్ పావెల్ 30 బంతుల్లో 40 పరుగులతో మెరిశాడు. ఈ ఇద్దరూ కలిసి కీలకమైన 64 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును విజయతీరాలకు చేర్చారు. కార్బిన్ బాష్ మూడు వికెట్లు తీసినా ముంబైను గెలిపించలేకపోయాడు. ఈ విజయంతో కేకేఆర్ 13 పాయింట్లతో ప్లేఆఫ్స్ రేసులో ముందంజ వేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!