

డిసెంబర్లో భారత్ పర్యటనకు రానున్న శ్రీలంకతో వన్డే సిరీస్‌కు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకునే అవకాశం ఉంది. డిసెంబర్ 13న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగాల్సిన తొలి వన్డే వేదిక మారవచ్చని క్రీడా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. స్టేడియంలో ఆధునికీకరణ పనులు చేపట్టాలని ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (DDCA) భావిస్తుండటంతో ఈ మార్పుపై చర్చ జరుగుతున్నట్లు సమాచారం.
స్టేడియంలో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు పిచ్‌లు, ఔట్‌ఫీల్డ్‌ను ఆధునీకరించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. వర్షం పడినప్పుడు మైదానంలో నీరు త్వరగా బయటకు వెళ్లేలా మెరుగైన డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ఈ పనులు పూర్తవడానికి కొన్ని నెలలు పట్టే అవకాశం ఉండటంతో, 2026–27 రంజీ ట్రోఫీలో ఢిల్లీ ఆడే కొన్ని మ్యాచ్‌లను పాలమ్ గ్రౌండ్‌కు తరలించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
తొలి వన్డేను అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియానికి మార్చే ప్రతిపాదన ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ, బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం వన్డేలు డిసెంబర్ 13న ఢిల్లీలో, 16న బెంగళూరులో, 19న అహ్మదాబాద్‌లో జరగాల్సి ఉంది. టీ20 మ్యాచ్‌లు డిసెంబర్ 22న రాజ్‌కోట్‌లో, 24న కటక్‌లో, 27న పుణెలో నిర్వహించనున్నారు. తొలి వన్డే వేదికపై పూర్తి స్పష్టత రావాలంటే బీసీసీఐ అధికారిక ప్రకటన కోసం వేచి చూడాల్సిందే.

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!