

రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని నవంబర్ 26న నిర్వహించనున్న ‘సంవిధాన్ రక్షా మార్చ్’లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజాస్వామ్యవాదులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి, హైదరాబాద్ ఇన్‌చార్జి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో ఈ రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీని నిర్వహించనున్నట్లు తెలిపారు. రాజ్యాంగం దేశ ప్రజలకు కల్పించిన హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం, సౌభ్రాతృత్వం వంటి మౌలిక విలువలను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని మంత్రి పేర్కొన్నారు. రాజ్యాంగ పరిరక్షణకు ప్రజలంతా కలిసికట్టుగా ముందుకు రావాలని కోరారు.
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా రాజ్యాంగ స్ఫూర్తిని ప్రజల్లో మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పొన్నం ప్రభాకర్ అన్నారు. రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కులు, స్వేచ్ఛకు భంగం కలగకుండా వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. రాజ్యాంగ పరిరక్షణ అనేది కేవలం రాజకీయ కార్యక్రమం కాదని, ప్రజాస్వామ్య వ్యవస్థను, పౌరుల హక్కులను కాపాడుకునేందుకు చేపట్టే సామూహిక బాధ్యత అని పేర్కొన్నారు.
నవంబర్ 26న ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్ ట్యాంక్‌బండ్ వద్ద లిబర్టీ సమీపంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం నుంచి నెక్లెస్ రోడ్డులోని ఇందిరా గాంధీ విగ్రహం వరకు భారీ ప్రదర్శన నిర్వహించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ఇన్‌చార్జి బి.ఎం. సందీప్ కుమార్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌తో పాటు రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొననున్నారు. ఈ ర్యాలీలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై రాజ్యాంగ పరిరక్షణకు తమ సంఘీభావాన్ని తెలియజేయాలని పొన్నం ప్రభాకర్ మరోసారి విజ్ఞప్తి చేశారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!