

మిస్ యూనివర్స్ 2026 కిరీటాన్ని ప్యూర్టోరికోకు చెందిన జెన్నిఫర్ బారెటో సొంతం చేసుకున్నారు. 75వ మిస్ యూనివర్స్ పోటీల గ్రాండ్ ఫినాలేలో ఆమె విశ్వసుందరిగా నిలిచారు. ప్యూర్టోరికో రాజధాని శాన్ జువాన్‌లోని జోస్ మిగ్యుయెల్ అగ్రెలోట్ కొలీజియంలో ఈ పోటీలు ఘనంగా జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా 116 మంది అందాల భామలు ఈ పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. మెక్సికోకు చెందిన ప్రస్తుత మిస్ యూనివర్స్ ఫాతిమా బోష్.. జెన్నిఫర్ బారెటోకు కిరీటాన్ని అలంకరించారు. డొమినికన్ రిపబ్లిక్‌కు చెందిన మెలిస్సా నూనెజ్ మొదటి రన్నరప్‌గా, వెనిజులాకు చెందిన క్లారా వేగాస్ గోయెట్జ్ రెండో రన్నరప్‌గా నిలిచారు. నేషనల్ కాస్ట్యూమ్, ప్రిలిమినరీ, ఫైనల్ రౌండ్లలో పోటీదారులు తమ అందం, ప్రతిభను ప్రదర్శించగా.. ఫిలిప్పీన్స్, న్యూజిలాండ్, వెనిజులా, డొమినికన్ రిపబ్లిక్, ప్యూర్టోరికో దేశాలకు చెందిన భామలు టాప్-5లో చోటు దక్కించుకున్నారు.
చివరి ప్రశ్నోత్తరాల రౌండ్‌లో ప్రస్తుత ప్రపంచానికి నాయకుల నుంచి అత్యంత అవసరమైన లక్షణం ఏమిటని పోటీదారులను అడిగారు. దీనికి జెన్నిఫర్ బారెటో సమాధానమిస్తూ.. నాయకులకు వృత్తిపరమైన నైపుణ్యాలతో పాటు ఇతరుల పట్ల సానుభూతి, సహానుభూతి ఉండాలని పేర్కొన్నారు. ఇతరులను విమర్శించడం కంటే తమ విలువలకు కట్టుబడి ఉంటూ, ఆదర్శంగా నిలిచి ఉన్నత ప్రమాణాలను నెలకొల్పాలని చెప్పారు. ప్రజల అవసరాలను అర్థం చేసుకుని, వారి అభిప్రాయాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించే నాయకత్వం సమాజంలో గణనీయమైన మార్పును తీసుకురాగలదని వివరించారు. జెన్నిఫర్‌కు రీసెర్చ్ సైకాలజీలో బ్యాచిలర్ డిగ్రీతో పాటు సైకాలజీ, క్లినికల్ సోషల్ వర్క్‌లో రెండు మాస్టర్స్ డిగ్రీలు ఉన్నాయి. 2021లో అమెరికా రక్షణ శాఖ పరిధిలోని ఫోర్ట్ హుడ్‌లో తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. ఫ్యామిలీ అడ్వకసీ ప్రోగ్రామ్‌లో భాగంగా గృహ హింస, పిల్లలపై వేధింపులకు గురైన సైనిక కుటుంబాలకు సహాయం అందించారు. ఇలాంటి ఘటనల నివారణ, బాధితులకు మద్దతు అందించే అంశాలపై నాయకులకు శిక్షణ ఇచ్చారు. కార్ల్ ఆర్. డార్నాల్ ఆర్మీ మెడికల్ సెంటర్‌లో స్వచ్ఛంద సేవ కూడా చేశారు. భారత్ తరఫున పాల్గొన్న కాజియా లిజ్ మెజో టాప్-30 వరకు చేరుకున్నప్పటికీ, టాప్-12లో చోటు దక్కించుకోలేకపోయారు. జెన్నిఫర్ విజయంతో ప్యూర్టోరికోకు మిస్ యూనివర్స్ కిరీటం ఆరోసారి దక్కింది. గతంలో ఆ దేశానికి చెందిన మారిసోల్ మలారెట్ (1970), డెబోరా కార్తీ-డియో (1985), దయనారా టోరెస్ (1993), డెనిస్ క్వినోన్స్ (2001), జులేకా రివెరా (2006) ఈ టైటిల్‌ను గెలుచుకున్నారు. సొంత గడ్డపై ప్యూర్టోరికో ఈ కిరీటాన్ని గెలుచుకోవడం ఇది రెండోసారి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!