

శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం భోగి. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్నారు. డింపుల్ హయాతి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ నెల 27న సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి చిత్రబృందం నిర్వహించిన మ్యూజికల్ ఈవెంట్‌లో గంగ పాటను విడుదల చేశారు. ప్రముఖ జానపద గాయకుడు నల్గొండ గద్దర్ అలియాస్ నర్సన్న ఈ పాటను ఆలపించారు. ఆయన కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా శర్వానంద్, నర్సన్న మధ్య జరిగిన సరదా సంభాషణ అందరినీ ఆకట్టుకుంది. గతంలో పలువురు రాజకీయ నాయకుల కోసం నర్సన్న పాటలు పాడిన విషయాన్ని ప్రస్తావించిన శర్వా.. “నర్సన్న.. మీరు చాలామందిని సీఎంలను చేశారు. మరి నన్ను కూడా విజయ్‌లాగా సీఎం చేస్తారా?” అంటూ చమత్కరించారు. దీనికి నర్సన్న స్పందిస్తూ.. దేవుడు అనుకుంటే శర్వానంద్ కూడా సీఎం కావచ్చని సరదాగా బదులిచ్చారు. అందుకు శర్వా నవ్వుతూ.. తాను నటుడిగా సంతోషంగా ఉన్నానని, అభిమానులను అలరించడం తనకు చాలన్నారు. దీంతో ఈవెంట్‌లో నవ్వులు విరిశాయి. గతంలో చంద్రబాబు నాయుడు, కేసీఆర్, వైఎస్ జగన్, రేవంత్ రెడ్డి తదితర నేతల కోసం నర్సన్న పాడిన రాజకీయ పాటలు ప్రజల్లోకి వెళ్లాయి. ముఖ్యంగా 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి కోసం పాడిన పాట ఆయనకు మంచి గుర్తింపు తెచ్చింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!