

యువ భారత జట్టు అద్భుతమైన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ముక్కోణపు సిరీస్ ఫైనల్‌కు అర్హత సాధించింది. బుధవారం జరిగిన కీలక పోరులో భారత్-ఎ జట్టు 101 పరుగుల తేడాతో అఫ్ఘానిస్థాన్-ఎను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్-ఎ నిర్ణీత 50 ఓవర్లలో 319/9 పరుగులు చేసింది. తిలక్ వర్మ (59), ప్రియాన్ష్ ఆర్య (58), కుమార్ కుశాగ్ర (58) అర్ధశతకాలతో జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించారు. అఫ్ఘాన్ బౌలర్లలో ఫర్మానుల్లా సఫీ, అబ్దుల్లా అహ్మద్జాయ్, ఫరీదున్ దావూద్జాయ్ తలో రెండు వికెట్లు తీశారు.
ఫైనల్‌కు చేరాలంటే అఫ్ఘాన్‌ను 236 పరుగుల లోపే కట్టడి చేయాల్సిన భారత్-ఎ ఆ లక్ష్యాన్ని సులభంగా సాధించింది. స్పిన్నర్ నిషాంత్ సింధు (4/31) అద్భుతంగా బౌలింగ్ చేయడంతో అఫ్ఘానిస్థాన్-ఎ 36.5 ఓవర్లలో 218 పరుగులకే ఆలౌటైంది. బహీర్ షా (57), ఫైజల్ షిన్వారి (46) మినహా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. యశ్ ఠాకూర్ రెండు వికెట్లు సాధించాడు. గత రెండు మ్యాచ్‌ల్లో ఓడినప్పటికీ, మెరుగైన రన్‌రేట్‌తో భారత్-ఎ ఫైనల్లోకి ప్రవేశించింది. నిషాంత్ సింధు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా ఎంపికయ్యాడు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!