

భారత క్రికెట్ పరిపాలనలో కీలక పరిణామంగా బీసీసీఐపై సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) వర్తించదని కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) స్పష్టం చేసింది. బీసీసీఐ ప్రభుత్వం నుంచి ఎటువంటి నిధులు పొందడం లేదని, ప్రభుత్వ నియంత్రణలో లేని ప్రైవేట్ సంస్థగా పనిచేస్తోందని పేర్కొంది. భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించే హక్కు బీసీసీఐకి ఎలా వచ్చిందనే అంశంతో పాటు ఆటగాళ్ల ఎంపిక విధానంపై సమాచారం కోరుతూ దాఖలైన అప్పీల్‌ను సీఐసీ తిరస్కరించింది.
ఇదే అంశంపై 2018లో సీఐసీ భిన్న నిర్ణయం తీసుకుని బీసీసీఐని ప్రజా సంస్థగా పరిగణించింది. అయితే ఆ నిర్ణయాన్ని బీసీసీఐ మద్రాస్ హైకోర్టులో సవాల్ చేసింది. అనంతరం సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు కేసును మళ్లీ పరిశీలించిన సీఐసీ తాజా తీర్పును వెలువరించింది. బీసీసీఐ రాజ్యాంగం, పార్లమెంట్ చట్టం, రాష్ట్ర చట్టం లేదా ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా ఏర్పడలేదని, తమిళనాడు సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ కింద నమోదైన ప్రైవేట్ సొసైటీ మాత్రమేనని పేర్కొంది. అందువల్ల ఆర్టీఐ చట్టంలోని ‘పబ్లిక్ అథారిటీ’ నిర్వచనంలోకి బీసీసీఐ రాదని స్పష్టం చేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!