

‘శాండ్ పేపర్ గేట్’ బాల్ టాంపరింగ్ వివాదంపై ఆస్ట్రేలియా క్రికెటర్ ఉస్మాన్ ఖవాజా చేసిన వ్యాఖ్యలకు దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్ మద్దతు తెలిపాడు. బాల్ టాంపరింగ్ వ్యవహారం గురించి ఆసీస్ జట్టులోని ప్రతి ఒక్కరికీ తెలుసునని అభిప్రాయపడ్డాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ వివాదంపై స్పందించిన ఏబీడీ.. 2018లో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మూడో టెస్టులో చోటుచేసుకున్న ఘటనను ప్రస్తావించాడు. ఆ మ్యాచ్‌లో బంతి ఆకారాన్ని మార్చేందుకు కామెరాన్ బాన్‌క్రాఫ్ట్ శాండ్‌పేపర్‌ను ఉపయోగించినట్లు బయటపడింది. ఈ వ్యవహారంలో స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌ల పాత్ర కూడా ఉందని ఆరోపణలు రావడంతో ముగ్గురిపై అప్పట్లో చర్యలు తీసుకున్నారు. ఈ వివాదంపై ఉస్మాన్ ఖవాజా తన పుస్తకంలో ప్రస్తావించడం తప్పేమీ కాదని ఏబీడీ పేర్కొన్నాడు. తాను ఎవరినీ వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకోవడం లేదని, ఎవరు సరైనవారు.. ఎవరు తప్పు అనే విషయంపై తీర్పు చెప్పడం లేదని స్పష్టం చేశాడు.
బాల్ టాంపరింగ్ ఘటన కేవలం పోర్ట్ ఎలిజబెత్ మైదానంలోనే జరిగిందని భావించడం పొరపాటని ఏబీ డివిలియర్స్ అభిప్రాయపడ్డాడు. అంతకుముందు జరిగిన ఇతర మ్యాచ్‌ల్లోనూ ఇలాంటి చర్యలకు పాల్పడి ఉండొచ్చని, డర్బన్ టెస్టులోనూ అలా జరిగి ఉండే అవకాశం ఉందని వ్యాఖ్యానించాడు. దీనిపై స్పష్టత రావాలంటే మ్యాచ్ ఫుటేజీని మరోసారి క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించాడు. ప్రస్తుతం ఈ వివాదంపై జరుగుతున్న చర్చ తనకు విచిత్రంగా అనిపిస్తోందని పేర్కొన్నాడు. జట్టులోని ఇతర ఆటగాళ్లకు శాండ్‌పేపర్ గురించి తెలుసా లేదా అనే ప్రశ్నకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని, కానీ చట్టవిరుద్ధమైన పని చేయబోతున్నారనే విషయం జట్టులోని ప్రతి ఒక్కరికీ తెలుసనే అంశాన్ని విస్మరిస్తున్నారని ఏబీడీ అభిప్రాయపడ్డాడు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!