

రియాలిటీ షో వేదికగా ప్రముఖ టెలివిజన్ నటి శివాంగి జోషి తన చిన్ననాటి అనుభవాన్ని పంచుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. కుటుంబ సభ్యులు నమ్మిన ఓ బంధువు తనతో అనుచితంగా ప్రవర్తించాడని ఆమె వెల్లడించారు. స్కూల్ నుంచి ఇంటికి తీసుకువచ్చే బాధ్యతను అతడికి అప్పగించేవారని, ఆ నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని అసభ్యంగా ప్రవర్తించేందుకు ప్రయత్నించాడని తెలిపారు. చిన్న వయసులో ఏం జరుగుతుందో అర్థం కాలేదని, అనంతరం విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు వెంటనే స్పందించి అతడిని ఇంటి నుంచి పంపించేశారని చెప్పారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో శివాంగి తల్లి కూడా స్పందించారు. పిల్లలకు చిన్న వయసు నుంచే గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి అవగాహన కల్పించడం ప్రతి తల్లిదండ్రి బాధ్యత అని ఆమె సూచించారు. అలాంటి అవగాహన పిల్లల భద్రతకు ఎంతో అవసరమని పేర్కొన్నారు. హిందీ టెలివిజన్ రంగంలో మంచి గుర్తింపు పొందిన శివాంగి జోషి, 'బాలికా వధు 2'లో ఆనంది పాత్రతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!