

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో ఎనిమిదో వారం నామినేషన్ల ప్రక్రియ వాడీవేడిగా సాగింది. ముఖ్యంగా త్రిగుణ్, వర్షిణి మధ్య ఎలిమినేషన్‌పై జరిగిన భావోద్వేగపూరిత సంభాషణ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. వర్షిణి ఎలిమినేట్ అయితే ఆమె కుటుంబానికి ఏం సమాధానం చెప్పాలని త్రిగుణ్ బాధపడుతూ మాట్లాడాడు. తన కుటుంబం కోసం, తనకంటూ గుర్తింపు సంపాదించుకోవడం కోసం హౌస్‌లోకి వచ్చానని చెబుతూ భావోద్వేగానికి గురయ్యాడు. దీంతో వంశీ, శ్వేత అతడిని ఓదార్చారు. మరోవైపు, త్రిగుణ్, వర్షిణి మధ్య జరిగిన సంభాషణలోనూ నాటకీయత కనిపించింది.
రెండో దశ నామినేషన్ల కోసం ముకేష్ గౌడ, త్రిగుణ్, అమన్, దేబ్జానీ, నీతూలను జడ్జీలుగా నియమించారు. ఎల్లో లెవల్ సభ్యుల్లో నామినేషన్ అవకాశం పొందే ముగ్గురిని జడ్జీలు ఎంపిక చేయాల్సి వచ్చింది. తొలుత శాశ్వత జడ్జీగా ఎవరిని నియమించాలనే అంశంపై చర్చ జరగగా, చివరకు నీతూను ఎంపిక చేశారు. అనంతరం నరేష్‌కు నామినేషన్ చేసే అవకాశం లభించింది. అతడు వర్షిణి, ఝాన్సీలను నామినేట్ చేశాడు. టాస్కుల్లో సరిగ్గా పాల్గొనడం లేదన్న నరేష్ వాదనకు వర్షిణి సమాధానమిస్తూ, ఇది కేవలం గేమ్ షో మాత్రమే కాదని, వ్యక్తిత్వానికి కూడా ప్రాధాన్యం ఉంటుందని చెప్పింది. తనకు ఇటీవలే శస్త్రచికిత్స జరిగిందని, అందువల్ల తన సామర్థ్యానికి తగ్గట్టుగా ఆడుతున్నానని వివరించింది. ఝాన్సీ తరచూ ఏడుస్తుందన్న నరేష్ వాదనను ఆమె ఖండించింది. చర్చ అనంతరం వర్షిణిపై చేసిన నామినేషన్‌ను జడ్జీలు అంగీకరించగా, ఝాన్సీపై చేసిన నామినేషన్‌ను తిరస్కరించారు.
నామినేషన్ల సమయంలో ముకేష్ గౌడ వ్యవహారశైలి వివాదానికి దారితీసింది. శివ నామినేషన్లలో సుధీర్, వంశీలను ప్రస్తావించినప్పుడు ముకేష్ పదేపదే జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం మొదలైంది. శివ తన వాదనను వినిపిస్తుండగా మధ్యలో అడ్డుకోవద్దని ఇతర జడ్జీలు కూడా ముకేష్‌కు సూచించారు. దేబ్జానీతోనూ అతడికి వాగ్వాదం జరిగింది. మరోవైపు, నీతూ, ముకేష్ మధ్య కూడా తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం నడిచింది. శివ తన నామినేషన్ పాయింట్లను వివరిస్తున్న సమయంలో ముకేష్ జోక్యం చేసుకోవడాన్ని పలువురు హౌస్‌మేట్స్ తప్పుబట్టారు. ఈ పరిణామాలతో నామినేషన్ల ప్రక్రియలో ఆట కంటే జడ్జీల మధ్య వాదనలే ఎక్కువగా కనిపించాయి.
తదుపరి నామినేషన్లలో శివ, శ్వేత, సుధీర్, వర్షిణి, ఝాన్సీ, రోహిత్, రామకృష్ణ, రామ్ ప్రసాద్‌ల పేర్లు చర్చకు వచ్చాయి. రోహిత్ నరేష్‌ను నామినేట్ చేయగా, రామకృష్ణ వర్షిణిని నామినేట్ చేశాడు. ఝాన్సీ శివను, శ్వేత ఝాన్సీని నామినేట్ చేశారు. జడ్జీల చర్చల అనంతరం సంబంధిత నామినేషన్లను ఖరారు చేశారు. చివర్లో బిగ్‌బాస్ ఇచ్చిన సూచనలను సరిగ్గా అర్థం చేసుకోకుండా రెడ్ టీమ్ సభ్యులతో ముకేష్ చర్చించడంపై బిగ్‌బాస్ అసహనం వ్యక్తం చేశారు. అనంతరం జడ్జీలు వంశీని నేరుగా నామినేట్ చేశారు. దీంతో ఈ వారం ఎలిమినేషన్‌కు వంశీ, సుధీర్, రామ్ ప్రసాద్, వర్షిణి, శివ, ఝాన్సీ, రోహిత్, రామకృష్ణ నామినేట్ అయ్యారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!