

ఐపీఎల్ తదుపరి సీజన్‌కు ముందు ఫ్రాంచైజీల మధ్య ఆటగాళ్ల బదిలీలపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ తాజాగా విడుదల చేసిన ఓ రహస్య సంకేతాలతో కూడిన వీడియోతో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్‌ను వీడి చెన్నై జట్టులో చేరనున్నాడనే ప్రచారం మొదలైంది. కొత్త ప్రధాన కోచ్ జహీర్ ఖాన్, సహాయ కోచ్‌లు ఆల్బీ మోర్కెల్, మోహిత్ శర్మ, గారెత్ బాటీతో పాటు జట్టు మస్కాట్ ‘లియో’ కనిపించిన ఈ వీడియోలో ఆటగాళ్ల బదిలీకి సంబంధించిన సంకేతం ఉందని అభిమానులు భావిస్తున్నారు. వీడియోలో ‘లియో’ ఆటగాళ్ల బదిలీ తాజా వివరాల గురించి ప్రశ్నించగా, జహీర్ ఖాన్ స్పందించలేదు. అయితే, ఆ సన్నివేశంలో కనిపించిన ఓ కాగితంపై ‘33’ అనే సంఖ్యను వృత్తాకారంలో గుర్తించడం అభిమానుల దృష్టిని ఆకర్షించింది.
హార్దిక్ పాండ్యా భారత జట్టు, ముంబై ఇండియన్స్ తరఫున 33 నంబర్ జెర్సీతో ఆడుతుండటంతో ఈ వీడియోలోని సంకేతం అతడిని ఉద్దేశించిందేనని సామాజిక మాధ్యమాల్లో చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ కూడా ఈ వీడియోపై స్పందిస్తూ, “అవునా? పక్కాగా ప్లాన్ చేస్తున్నారు” అనే అర్థం వచ్చేలా ఎక్స్ వేదికగా వ్యాఖ్యానించడంతో ఊహాగానాలు మరింత పెరిగాయి. అయితే, అశ్విన్ వ్యాఖ్యలు లేదా వీడియోలోని సంకేతం ఆటగాడి బదిలీ ఖరారైనట్లు నిర్ధారించవు. హార్దిక్ పాండ్యా చెన్నై జట్టులో చేరనున్నాడనే వార్తలపై చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ యాజమాన్యాలు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!