

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 నుంచి ఏడో వారంలో ఎలిమినేట్ అయిన దక్షి గుత్తికొండ, షోలో తన అనుభవంతో పాటు కంటెస్టెంట్ల ఆటతీరుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బిగ్‌బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2లో గుర్తింపు తెచ్చుకున్న దక్షి, ఐదో వారంలో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి అడుగుపెట్టింది. అయితే, హౌస్‌లో తనదైన ముద్ర వేయడంలో ఆమె వెనుకబడింది. ఫిజికల్ టాస్కుల్లో పెద్దగా రాణించకపోవడంతో పాటు, ఇతర కంటెస్టెంట్లతోనూ ఆశించిన స్థాయిలో కలిసిపోలేకపోయింది. వరుసగా రెండు వారాలు నామినేషన్లలో ఉండటంతో పాటు తక్కువ ఓట్లు రావడంతో ఏడో వారంలో హౌస్ నుంచి బయటకు వచ్చింది. ఎలిమినేషన్ అనంతరం అభిమానులు ఆమెకు ఘనంగా స్వాగతం పలకగా, అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో దక్షి మాట్లాడుతూ, ఈ సీజన్‌లో రోహిత్, త్రిగుణ్ ఇద్దరూ చాలా స్మార్ట్‌గా ఆడుతున్నారని అభిప్రాయపడింది. హౌస్‌లోకి వెళ్లకముందు త్రిగుణ్‌పై ప్రతికూల అభిప్రాయం, రోహిత్‌పై సానుకూల అభిప్రాయం ఉండేవని, అయితే లోపలికి వెళ్లిన తర్వాత తన అంచనా మారిందని తెలిపింది. త్రిగుణ్ కొన్నిసార్లు దూకుడుగా వ్యవహరించినప్పటికీ, ఇతరులతో కలిసిపోతాడని, సమస్యలు ఎదురైనప్పుడు అందరితో కూర్చొని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తాడని చెప్పింది. మరోవైపు, ఎవరితోనైనా గొడవ జరిగితే రోహిత్ వారితో మళ్లీ కలవడానికి అంతగా ఆసక్తి చూపించడని తన అభిప్రాయాన్ని వెల్లడించింది. ఈ కారణాలతో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 విజేతగా త్రిగుణ్ నిలుస్తాడని తాను భావిస్తున్నట్లు దక్షి పేర్కొంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!