

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ఈవో వెంకట్రావు రాజీనామా చేశారు. దేవాదాయ శాఖ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నప్పుడు ఆయనకు యాదగిరిగుట్ట ఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించారు. గతేడాది ఆగస్టు 30 న ఆయన పదవీ విరమణ చేసినా, ప్రభుత్వం యాదగిరిగుట్ట ఈవోగా కొనసాగించి, శిల్పారామం ఆర్ట్స్, క్రాఫ్ట్స్, కల్చరల్ సొసైటీ స్పెషల్ ఆఫీసర్‌గా కూడా బాధ్యతలు ఇచ్చింది.
ఈవోగా చేరిన తర్వాత ఆయన శని, ఆదివారాలు మాత్రమే ఆలయానికి వచ్చినట్లు విమర్శలు వచ్చాయి. చింతపండు దొంగతనం వివాదంలో చర్యలు తీసుకోలేదని, ఆలయ నిర్వహణలో ఏకపక్షంగా వ్యవహరించారని, ప్రభుత్వ విప్‌గా ఉన్న ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యను పట్టించుకోలేదని విమర్శించారు.
ఇటీవల వైకుంఠ ఏకాదశి వేడుకల సందర్భంగా ఎమ్మెల్యే, భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డికి ముందస్తు సమాచారం ఇవ్వకుండా సీఎం, గవర్నర్‌ను ఆహ్వానించడంతో పాటు, ఎమ్మెల్యే అయిలయ్యకు ఏఈవో ద్వారా మాత్రమే ఆహ్వాన పత్రం పంపడంతో ఎమ్మెల్యే, ఎంపీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.
ఈ వివాదాలే రాజీనామా కారణమని ప్రచారం జరిగినా, అనారోగ్య కారణాలతో వైదొలుగుతున్నానని సీఎస్‌కు తెలిపానని, ప్రభుత్వం రిలీఫ్ చేసిందని వెంకట్రావు మీడియాకు తెలిపారు. ప్రభుత్వం ఆయన రాజీనామాను ఆమోదించి ఉత్తర్వులు జారీ చేసింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!