

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక దగ్గరపడుతోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు విజయం తమదేనని చెప్పుకుంటున్నాయి. బీజేపీ కూడా గెలిచేది తమ పార్టీయేనని చెప్పుకుంటున్నప్పటికీ, ఆ పార్టీకి అంత సీన్ లేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పటివరకు ప్రచార రంగంలోకి రాలేదు. వస్తాడో రాడో తెలియదు. ఇక హరీశ్ రావు తండ్రి చనిపోవడంతో ఆయన విషాదంలో ఉన్నారు. దీంతో ఉపఎన్నికలో ప్రచారం చేయడం లేదు. ఇక కవిత ఇప్పటికే బీఆర్ఎస్ సంబంధాలు తెంచుకున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా కేటీఆర్ ఒక్కడే ప్రచార భారాన్ని మోస్తున్నాడని చెప్పొచ్చు. కాంగ్రెస్ తరపున రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు ప్రచార రంగంలో ఉన్నారు. ఆ పార్టీ నలభైమందిని స్టార్ క్యాంపెయినర్లుగా ప్రకటించినప్పటికీ, మిగతావారు ప్రచారంలో కనిపించడం లేదు. మొత్తం మీద కాంగ్రెస్, బీఆర్ఎస్ మాత్రమే నువ్వా నేనా అన్నట్లుగా ఉన్నాయి.
ఇప్పటివరకు జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై రెండు సర్వేల ఫలితాలు వచ్చాయి. ఈ రెండు సర్వేల్లో గులాబీ పార్టీకే విజయమని తేలింది. ఈ మధ్య కేకే సర్వేస్ తన సర్వే ఫలితాలను వెల్లడించింది. బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని ఆ సర్వే తెలిపింది. ఉపఎన్నికలో బీఆర్ఎస్ ఏకపక్ష విజయం సాధిస్తుందని కేకే సర్వే తేల్చింది. బీఆర్ఎస్ పార్టీకి ఏకంగా 55 శాతం ఓట్లు వస్తాయని చెప్పింది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి 37 శాతం ఓట్లు మాత్రమే వస్తాయని, బీజేపీకి గతంలో వచ్చిన ఓట్లలో సగమే దక్కుతాయని కేకే సర్వే స్పష్టం చేసింది. ముఖ్యంగా మజ్లిస్ పార్టీ కాంగ్రెస్కు మద్దతు ప్రకటించినప్పటికీ, ముస్లిం ఓట్లర్లు దానిని పట్టించుకోకుండా సగానికి పైగా ఓట్లను బీఆర్ఎస్ పక్షాన వేస్తున్నారని కేకే విశ్లేషించారు. జూబ్లీహిల్స్ వంటి హైప్రొఫైల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్కు 55 శాతం ఓట్లు రావడం అసాధారణమైన అంచనాగా పరిగణించవచ్చు. కేకే సర్వేకు విశ్వసనీయతను పెంచిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ప్రధానం.
2019 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఏకపక్ష విజయం లభిస్తుందని, ఆ పార్టీకి దాదాపు 150కి పైగా సీట్లు దక్కుతాయని కేకే ముందే అంచనా వేయగలిగారు. ఆ సమయంలో ఇతర సర్వే సంస్థలు, విశ్లేషకులు ఇచ్చిన అంచనాలకు భిన్నంగా కేకే అంచనా వాస్తవ ఫలితాలకు చాలా దగ్గరగా ఉండటం విశేషం. అంతేకాకుండా, 2024 ఏపీ ఎన్నికల్లో కూడా కూటమి ప్రభుత్వానికి అత్యధిక స్థానాలు వస్తాయని, జనసేన పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధిస్తుందని ఆయన అంచనా వేశారు. అనుకున్నట్లుగానే ఆ అంచనా నిజమైంది. ఈ విజయంతో తెలుగు రాజకీయ వర్గాల్లో కేకే సర్వేస్ పేరు బలంగా నాటుకుపోయింది. అయితే జూబ్లీహిల్స్లో కేకే సర్వే ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. అది ఫేక్ సర్వే అని, బీఆర్ఎస్ డబ్బులు ఇచ్చి ఆ సర్వే చేయించుకుందని విమర్శించింది. ఇక తాజాగా చాణక్య స్ట్రాటజీస్ సంస్థ సర్వే కూడా బీఆర్ఎస్కే విజయమని తేల్చింది.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీఆర్ఎస్ అత్యధికంగా 43 శాతం ఓట్లు దక్కించుకోబోతున్నట్లు తేలింది. రెండో స్థానంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 38 శాతం ఓట్లను, బీజేపీ 10 శాతం ఓట్లను సాధించబోతున్నట్లు తేలింది. మరో 9 శాతం ఓట్లు అటు ఇటు మారే అవకాశం ఉందని చాణక్య స్ట్రాటజీస్ అంచనా వేసింది. అలాగే ప్రభుత్వంపై ప్రజల్లో అభిప్రాయం చూస్తే, 29 శాతం మందే "బాగుంది” అన్నారు. మరో 63 శాతం “బాగోలేదు” అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కంటే బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు చాణక్య స్ట్రాటజీస్ సంస్థ సర్వే ఫలితాలు చెబుతున్నాయి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!