

తెలంగాణ రాజకీయాల్లో మార్పు గాలులు వీచుతున్నాయి. ఎన్నికల ప్రచారం పాత బాటలో కాదు — ఇప్పుడు టెక్నాలజీతో కొత్త పుంతలు తొక్కుతోంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు నాయకులు కొత్త కొత్త రకాల ప్రచార పద్ధతులను అవలంబిస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ మార్పుకు నిదర్శనంగా నిలిచారు. రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైన “హైడ్రా” వ్యవహారాన్ని ఆయన రాజకీయ ప్రచారంగా మలిచారు. ప్రచార సభల్లో, రోడ్ షోలలో కేటీఆర్ ఏర్పాటు చేసిన ఎల్ఈడీ స్క్రీన్లపై హైడ్రా బాధితుల గోడును వినిపిస్తున్నారు. ఇళ్లు కూల్చి నడిరోడ్డు మీదకు వచ్చామని కన్నీళ్లతో చెబుతున్న మహిళల వీడియోలు ప్రజల్లో చర్చనీయాంశమయ్యాయి.
“హైడ్రా రాకాసి బోరబండ గల్లీలోకి రాకూడదంటే కారు గుర్తుకు ఓటేయండి” అంటూ కేటీఆర్ పిలుపునిస్తున్నారు. ఇందిరమ్మ రాజ్యం పేరుతో గరీబోళ్ల ఇళ్లు కూల్చిన కాంగ్రెస్ పాలనను ప్రజలు మరిచిపోలేదని ఆయన వ్యాఖ్యానించారు. మాగంటి సునీత గెలుపుతో ప్రజా ధిక్కారం వ్యక్తమవుతుందని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
హైడ్రా అంశంపై కేటీఆర్ చేసిన ఈ భావోద్వేగ ప్రచారం నిజంగా బీఆర్ఎస్ కు లాభిస్తుందా లేదా అన్నది మాత్రం ఫలితాలే చెప్పాలి.











కామెంట్స్ (1)
Smart move by KTR 👏