

అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం మరో రెండు రోజుల్లో అధికారికంగా ఖరారు కానుంది. ఈ నేపథ్యంలో ఇరాన్ పునర్నిర్మాణానికి అమెరికా 300 బిలియన్ డాలర్లు చెల్లించనుందనే వార్తలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖండించారు. ట్రూత్ సోషల్ వేదికగా స్పందించిన ఆయన, ఇరాన్‌కు ఎలాంటి ప్రత్యక్ష నష్టపరిహారం లేదా ప్రభుత్వ నిధులు ఇవ్వడం లేదని స్పష్టం చేశారు. అలాగే, భవిష్యత్తులో అణ్వాయుధాల అభివృద్ధికి దూరంగా ఉంటామని ఇరాన్ హామీ ఇచ్చిందని పేర్కొన్నారు.
అయితే, ఇరాన్లో ఆర్థికాభివృద్ధి మరియు పునర్నిర్మాణ కార్యక్రమాలకు ఊతమివ్వడానికి 300 బిలియన్ డాలర్ల ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఏర్పాటు చేసే ప్రతిపాదన ఒప్పందంలో భాగంగా ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. అమెరికా, గల్ఫ్ దేశాలు, ఆసియా, దక్షిణ అమెరికా, ఆఫ్రికా దేశాలకు చెందిన ప్రైవేట్ కంపెనీలు ఈ ఫండ్‌లో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. ఉక్కు పరిశ్రమలు, రిఫైనరీలు, విమానాశ్రయాలు వంటి కీలక మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఈ నిధులు ఉపయోగపడనున్నాయి. చమురు, గ్యాస్ నిల్వలు, యువ మానవ వనరులు మరియు పలు రంగాల్లో అవకాశాల కారణంగా ఇరాన్ పెట్టుబడిదారులను ఆకర్షించే సామర్థ్యం కలిగి ఉందని నిపుణులు భావిస్తున్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!