

రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి ముందుకు సాగితే అనేక కీలక సమస్యలకు శాశ్వత పరిష్కారాలు లభిస్తాయని చంద్ర బాబు నాయుడు వ్యాఖ్యానించారు. ముఖ్యంగా నీటి వనరుల విషయంలో పరస్పర సహకారం అత్యంత అవసరమని స్పష్టం చేశారు.
ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే నాగార్జున సాగర్ జలాలను వినియోగించుకునేలా ఎస్ఎల్బీసీ, ఎస్ఆర్బీసీ వంటి ప్రాజెక్టులు రూపుదిద్దుకున్నాయని గుర్తు చేశారు. ఆ తర్వాత కల్వకుర్తి లిఫ్ట్, ఏఎమ్మార్ ఎత్తిపోతల, నెట్టెంపాడు వంటి కీలక ప్రాజెక్టులను పూర్తి చేసినట్టు తెలిపారు.
కృష్ణా డెల్టా ఆధునీకరణ పేరుతో నీటిని పొదుపు చేసి, ఆ నీటిని తెలంగాణకు కేటాయించడం ద్వారా బీమా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తిచేశామని పేర్కొన్నారు. అలాగే గోదావరి నది పై గుత్ప, అలీసాగర్, దేవాదుల వంటి ఎత్తిపోతల పథకాలను చేపట్టామని తెలిపారు.
ఆంధ్ర ప్రాంతంలో చాగల్నాడు, పుష్కర, తాటిపూడి వంటి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ప్రారంభించామని, పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా కృష్ణా డెల్టాకు నీరు అందించగలిగామని చెప్పారు. రాష్ట్ర విభజన అనంతరం పోలవరం ప్రాజెక్టుకు ప్రత్యేక నిధులు, ప్రత్యేక చట్టం ఇచ్చిన విషయాన్ని కూడా గుర్తు చేశారు.
గతేడాది మాత్రమే కృష్ణా, గోదావరి నదుల నుంచి సుమారు 6,282 టీఎంసీల నీరు సముద్రంలోకి వృథాగా వెళ్లిపోయిందని తెలిపారు. ప్రతి ఏడాది గోదావరి నుంచి దాదాపు 3 వేల టీఎంసీల నీరు ఉపయోగం లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గోదావరి నీళ్లు పుష్కలంగా ఉన్నాయని, వాటిని తెలంగాణ వినియోగించుకున్నా ఎప్పుడూ అడ్డుకోలేదని స్పష్టం చేశారు. విభజన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపైనా అభ్యంతరం చెప్పలేదని తెలిపారు.
భవిష్యత్తులో కృష్ణా–గోదావరి నదుల అనుసంధానం, అలాగే ఆంధ్రప్రదేశ్లోని అన్ని నదులను కలపాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలకు తావు ఉండకూడదని, ఇది రాజకీయ వేదిక కాదని, ఐక్యత గురించే మాట్లాడుతున్నానని అన్నారు. నీటి విషయంలోనైనా, సహకారం విషయంలోనైనా తెలుగువారంతా కలిసి నిలవాల్సిన అవసరం ఉందని చంద్ర బాబు నాయుడు స్పష్టం చేశారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!