

పిల్లలకు మూడేళ్లు నిండగానే ప్రీస్కూల్స్‌లో చేర్పించే తల్లిదండ్రుల సంఖ్య పెరుగుతోంది. దీంతో నగరాలతో పాటు గ్రామాల్లోనూ ప్రీస్కూల్స్ సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అయితే, పిల్లలను బడిలో చేర్పించడమే కాకుండా ఆ పాఠశాలకు అవసరమైన గుర్తింపు ఉందా? ఉపాధ్యాయులకు తగిన విద్యార్హతలు, శిక్షణ ఉన్నాయా? అనే విషయాలను తల్లిదండ్రులు పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు. అర్హతలేని సిబ్బంది, భద్రత లేని వాతావరణం చిన్నారుల శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపే ప్రమాదం ఉంది. ప్రతి 20 మంది పిల్లలకు ఒక ఉపాధ్యాయుడు, ఒక సంరక్షకుడు ఉండేలా చూడాలి. పాఠశాలలో సురక్షితమైన భవనం, ప్రహరీ, పరిశుభ్రమైన మరుగుదొడ్లు, రక్షిత తాగునీరు, ఆటస్థలం, సీసీటీవీ నిఘా, అగ్నిమాపక పరికరాలు, ప్రథమ చికిత్స సదుపాయాలు ఉండాలి. చిన్నారులకు ఆటపాటలతో కూడిన అభ్యాసాన్ని అందిస్తూ, పూర్వప్రాథమిక విద్యా విధానానికి అనుగుణంగా బోధన జరగాలి.
పిల్లల భద్రత విషయంలో తల్లిదండ్రులు కూడా అప్రమత్తంగా ఉండాలి. పాఠశాల గుర్తింపు పత్రాలు, ఉపాధ్యాయుల విద్యార్హతలు, సిబ్బంది నేపథ్య పరిశీలన, ఫీజుల విధానం, పిల్లల రక్షణకు సంబంధించిన నిబంధనలను తెలుసుకోవాలి. పేరెంట్స్-టీచర్స్ సమావేశాలు క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారా? పిల్లల ఆరోగ్య రికార్డులు నిర్వహిస్తున్నారా? అనే విషయాలను పరిశీలించాలి. పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన తర్వాత పిల్లల ప్రవర్తనలో భయం, ఆందోళన లేదా అసాధారణ మార్పులు కనిపిస్తే వాటిని నిర్లక్ష్యం చేయకూడదు. చిన్నారులపై శారీరక, మానసిక వేధింపులు లేకుండా చూడటంతో పాటు పరీక్షలు, చదువుల పేరుతో అధిక ఒత్తిడి చేయకూడదు. మరుగుదొడ్డికి వెళ్లే సమయంలో తగిన సంరక్షణ, జంక్‌ఫుడ్‌పై నియంత్రణ, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కూడా ఉండాలి. ఏవైనా సమస్యలు ఎదురైతే స్థానిక విద్యాశాఖ అధికారులకు లేదా బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌కు ఫిర్యాదు చేయవచ్చు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!