

ఇజ్రాయెల్–హమాస్ కాల్పుల విరమణ ఒప్పందంలో కీలక భాగంగా రూపొందించిన గాజా శాంతి మండలి (గాజా పీస్ బోర్డు) ని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గురువారం అధికారికంగా ప్రారంభించారు. ఛైర్మన్ హోదాలో ఆయన మండలి చార్టర్ పై సంతకం చేశారు. ఈ కార్యక్రమం స్విట్జర్లాండ్లోని దావోస్ వేదికగా జరిగింది.
ఐక్యరాజ్యసమితికి ప్రత్యామ్నాయంగా ఈ మండలిని ముందుకు తీసుకొస్తున్నారన్న చర్చల నేపథ్యంలో, ఈ ప్రారంభోత్సవానికి భారత్ సహా పలు కీలక దేశాలు హాజరు కాలేదు. అయితే పశ్చిమాసియాలో ప్రాధాన్యత గల దేశాలైన సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈలు పాల్గొన్నాయి. ఈజిప్టు, తుర్కియే, అజర్బైజాన్, పాకిస్థాన్, మొరాకో, ఇండోనేసియా, పరాగ్వే, హంగేరి వంటి దేశాలు కలిపి మొత్తం 19 దేశాలు ఈ కార్యక్రమంలో భాగమయ్యాయి.
ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ, గాజా శాంతి మండలి అమెరికా ప్రయోజనాల కోసం కాకుండా ప్రపంచ శాంతి కోసమేనని చెప్పారు. ఈ మండలిలో చేరేందుకు అనేక దేశాలు ఆసక్తి చూపుతున్నాయని పేర్కొన్నారు. గాజా ప్రాంత పునర్నిర్మాణం, పాలన, శాంతి పరిరక్షణ వంటి అంశాలను ఈ మండలి పర్యవేక్షించనుందని తెలిపారు.
అయితే బ్రిటన్, చైనా, రష్యా, జర్మనీతో పాటు భారత్ కూడా ఈ కార్యక్రమానికి దూరంగా ఉంది. మండలిలో చేరాలంటూ ఇటీవల ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఆహ్వానం పంపినప్పటికీ, ఈ అంశంపై భారత్ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. గాజా పాలస్తీనియుల సమస్యకు సంబంధించి సున్నిత అంశాలు ఉండటంతో, ఆచితూచి నిర్ణయం తీసుకోవాలనే అభిప్రాయంలో మోదీ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదే సమయంలో నాటో దేశాలైన నార్వే, స్వీడన్లు ఈ మండలిలో చేరబోమని ఇప్పటికే స్పష్టం చేశాయి. ఫ్రాన్స్, బ్రిటన్, ఇటలీ, కెనడా కూడా ఆసక్తి చూపడం లేదు. మొత్తం మీద దాదాపు 60 దేశాలకు ట్రంప్ ఆహ్వానాలు పంపినట్లు సమాచారం.
ఇతర అంతర్జాతీయ అంశాల పై స్పందించిన ట్రంప్, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం తప్పనిసరిగా ముగియాలని అన్నారు. ఇప్పటికే అనేక ప్రాణాలు కోల్పోయాయని, ఈ రక్తపాతం ఆగాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ఈ క్రమంలో దావోస్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ తో ట్రంప్ సమావేశమయ్యారు. ఈ భేటీ సానుకూలంగా జరిగిందని ట్రంప్ వెల్లడించారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!