

బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) సహా పలు మున్సిపల్ కార్పొరేషన్లకు త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ముంబై రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. గత రెండు దశాబ్దాలుగా వేర్వేరు రాజకీయ మార్గాల్లో ఉన్న శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రే తిరిగి ఒక్కటయ్యారు. వోర్లిలోని హోటల్ బ్లూ సీలో నిర్వహించిన సంయుక్త మీడియా సమావేశంలో, రాబోయే మున్సిపల్ ఎన్నికలను కలిసికట్టుగా ఎదుర్కొంటామని ప్రకటించారు.
ఈ సందర్భంగా ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడుతూ, మరాఠా ప్రజల ప్రయోజనాలే లక్ష్యంగా శివసేన యూబీటీ, ఎంఎన్ఎస్ కలిసి బీఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తాయని తెలిపారు. ఐక్యతే బలం అని, విభజన జరిగితే బలహీనతకు దారి తీస్తుందని హెచ్చరించారు. ఓట్ల విభజన జరగకుండా అప్రమత్తంగా ఉండాలని కోరారు. ముంబైను దెబ్బతీయడానికి కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని పరోక్షంగా బీజేపీపై విమర్శలు చేశారు. అయితే ముంబై మరాఠా ప్రజలదేనని స్పష్టం చేశారు.
రాజ్ ఠాక్రే మాట్లాడుతూ, ముంబై మేయర్ పదవి తప్పనిసరిగా ఒక మరాఠా వ్యక్తికే దక్కాలని అన్నారు. అది తమ పార్టీ నుంచైనా లేదా ఉద్ధవ్ ఠాక్రే పార్టీ నుంచైనా కావచ్చని చెప్పారు. మహారాష్ట్ర ప్రయోజనాల ముందు వ్యక్తిగత భేదాలు ముఖ్యముకాదని, ఈ రోజు నుంచి తమ సంయుక్త ప్రయాణం ప్రారంభమైందని తెలిపారు. సీట్ల పంపకంపై నిర్ణయం తర్వాత ప్రకటిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో సంజయ్ రౌత్, ఆదిత్య ఠాక్రే కూడా పాల్గొన్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!