

ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో రాజకీయ ఉత్కంఠ నెలకొంది. తెల్లవారుజామునే పోలీసులు మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నేత జోగి రమేశ్ నివాసాన్ని భారీగా చుట్టుముట్టారు. ఈ పరిణామం రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ చర్చలకు దారితీసింది.
వార్తల ప్రకారం, నకిలీ మద్యం తయారీ కేసులో జోగి రమేశ్‌ను అరెస్ట్ చేయడానికి పోలీసులు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.
ఇబ్రహీంపట్నం, ములకలచెరువుల ప్రాంతాల్లో ఇటీవల భారీ స్థాయిలో నకిలీ మద్యం తయారీ డంపులు బహిర్గతమైన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడు జానార్ధన్రావు పోలీసుల కస్టడీలో ఉండగానే ఒక వీడియో విడుదల చేశారు. అందులో జోగి రమేశ్ ఆదేశాల మేరకే నకిలీ మద్యం తయారు చేశానని, ఆ కేసు బయటపడిన తర్వాత తనను విస్మరించారని ఆరోపించారు.
ఆశ్చర్యకరంగా, విచారణ సమయంలో సెల్‌ఫోన్ పోయిందని చెప్పిన జానార్ధన్రావు, పోలీసుల అదుపులో ఉండగానే వీడియో రూపొందించడం కొత్త సందేహాలకు తావు కల్పించింది.
ఇదిలా ఉంటే, సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ తాను రాజకీయ ప్రతీకారంతో ఈ కేసులో ఇరికించారని జోగి రమేశ్ ఆరోపించారు. తాను నకిలీ మద్యంతో ఎలాంటి సంబంధం లేనని, ఇందుకు సాక్ష్యంగా ఇటీవల విజయవాడ దుర్గమ్మ ఆలయంలో కుటుంబ సభ్యుల సమక్షంలో ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు, లోకేశ్ కూడా అదే విధంగా ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు.
ఈ పరిణామాల మధ్య జోగి రమేశ్ ఇంటిని పోలీసులు చుట్టుముట్టడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఆయన్ని అరెస్ట్ చేసేందుకే ఈ చర్య తీసుకున్నారని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరికొద్ది సేపట్లో పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!