

ఎల్‌నినో, వర్షాభావ పరిస్థితుల ప్రభావం నుంచి రైతులు, గ్రామీణ ప్రజలను కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం రూ.10 వేల కోట్లతో భారీ కరువు నివారణ కార్యక్రమాన్ని చేపట్టేందుకు సిద్ధమవుతోందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. నవంబర్ 27న హైదరాబాద్‌లో నిర్వహించిన తెలంగాణ క్లైమేట్ కాన్‌క్లేవ్–2026 కర్టెన్ రైజర్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రాబోయే సంక్రాంతి తర్వాత ఐదు నెలల పాటు ప్రతినెలా రూ.2 వేల కోట్ల విలువైన పనులు చేపట్టేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. వర్షపు నీటి సంరక్షణ, నీటి నిల్వ సామర్థ్యం పెంపు, చెరువులు–కాలువల పునరుద్ధరణ, ‘పొలం బాట’ ద్వారా వ్యవసాయ క్షేత్రాలకు రహదారి సౌకర్యాలు మెరుగుపరచడం, స్థానిక నీటి ప్రవాహ మార్గాల అభివృద్ధి, గ్రామీణ మౌలిక వసతుల బలోపేతం ఈ కార్యక్రమంలో ప్రధాన అంశాలుగా ఉంటాయని వివరించారు. ఖర్చు చేసే ప్రతి రూపాయితో ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనం కలిగేలా పనులు చేపడతామని, సంబంధిత శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలని అధికారులకు సూచించారు.
వాతావరణ సవాళ్లను పెట్టుబడులు, ఉపాధి, సాంకేతిక ఆవిష్కరణలకు అవకాశాలుగా మలచుకోవాలని ప్రభుత్వం భావిస్తోందని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సౌర, పవన విద్యుత్, బ్యాటరీ నిల్వ రంగాల్లో కలిపి 6,000 మెగావాట్ల సామర్థ్యానికి టెండర్లు ఆహ్వానించినట్లు వెల్లడించారు. తెలంగాణ ఇన్వెస్ట్ గ్లోబల్ సమ్మిట్‌లో భాగంగా డిసెంబర్ 7, 8 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో తెలంగాణ క్లైమేట్ కాన్‌క్లేవ్ నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ సమావేశం ద్వారా ‘తెలంగాణ క్లైమేట్ రెసిలియన్స్ అజెండా–2026–2036’కు రూపకల్పన చేయనున్నారు. కరువు నివారణ, వాతావరణ అనుకూల వ్యవసాయం, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, వడగాలుల నుంచి రక్షణ, జీవవైవిధ్య పరిరక్షణ, పునరుత్పాదక ఇంధనం, క్లైమేట్ ఫైనాన్స్ వంటి అంశాలపై చర్చించనున్నారు. శాస్త్రీయ పరిజ్ఞానాన్ని సంప్రదాయ జ్ఞానం, ప్రజల భాగస్వామ్యంతో అనుసంధానించి పచ్చదనం, జలభద్రతతో కూడిన వాతావరణ ప్రతికూలతలను తట్టుకునే తెలంగాణను నిర్మించాలని మంత్రి పిలుపునిచ్చారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!