

కృష్ణా జలాల పంపిణీలో తెలంగాణకు న్యాయంగా రావాల్సిన వాటాను సాధించేందుకు సుప్రీంకోర్టులో సమర్థంగా వాదనలు వినిపించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్‌తో నీటి పంపిణీకి సంబంధించి వివాదంలో ఉన్న అన్ని అంశాలపై అవసరమైన ఆధారాలను న్యాయస్థానానికి సమర్పించాలని సూచించారు. ఈ నెల 18వ తేదీ తర్వాత సుప్రీంకోర్టులో కేసు విచారణకు రానున్న నేపథ్యంలో న్యాయ నిపుణులతో చర్చించారు. ఎంసీఆర్ హెచ్ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో నీటిపారుదల శాఖపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీటిపారుదల సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, సీఎంఓ కార్యదర్శి మాణిక్ రాజ్, నీటిపారుదల శాఖ కార్యదర్శి ఈ. శ్రీధర్, జాయింట్ సెక్రటరీ కె. శ్రీనివాస్, అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సి.ఎస్. వైద్యనాథన్, శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
డిండి, అచ్చంపేట ఎత్తిపోతల పథకాల పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఇంజినీర్లను ఆదేశించారు. ఇప్పటికే నిర్ణయించిన ప్రకారం ఏదుల నుంచి ఈ రెండు పథకాలకు నీటిని అందించాలని స్పష్టం చేశారు. ఈ పథకాలకు అవసరమైన 0.6 టీఎంసీల నీటిని నార్లపూర్ నుంచి ఏదుల వరకు తరలించేందుకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని సూచించారు. ఎక్కడ సొరంగాలు, ఎక్కడ కాలువలు అవసరమో గుర్తించి సమగ్ర డీపీఆర్ సిద్ధం చేయాలని ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అదనపు టీఎంసీ పనుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని అధికారులను హెచ్చరించారు. గత ప్రభుత్వం చేసిన తప్పులు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న రెండు టీఎంసీల నీటిని కూడా పూర్తిస్థాయిలో తరలించలేని పరిస్థితి ఉందని పేర్కొంటూ, ముందుగా సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసుల పురోగతిని పరిశీలించాలని ఆదేశించారు. అనంతరం భూసేకరణ పూర్తి చేసి, కేంద్ర జల సంఘం నుంచి అవసరమైన అనుమతులు పొందడంతో పాటు సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధం చేసుకోవాలని స్పష్టం చేశారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!