

తెలంగాణలో భూ అక్రమాలు, ఆక్రమణలు, భూ చట్టాలు, నిబంధనలు, ప్రభుత్వ ఉత్తర్వుల ఉల్లంఘనలపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. సెప్టెంబర్ 16న శాసనసభలో సెక్షన్ 22-ఏకు సంబంధించిన భూ అంశాలపై జరిగిన చర్చ నేపథ్యంలో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, మాజీ మంత్రులు కేటీఆర్, టి.హరీశ్‌రావు, ఇతర మాజీ ప్రజాప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులు, భాగస్వాములకు సంబంధించిన భూములతో పాటు పలు ఇతర భూ వ్యవహారాలను కమిటీ పరిశీలించనుంది. సిద్ధిపేట, రంగారెడ్డి, రాజన్న సిరిసిల్ల, మహబూబ్‌నగర్, హైదరాబాద్ జిల్లాల్లోని 16 అంశాలను విచారణ పరిధిలోకి తీసుకున్నారు.
కాలేజియేట్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఎ.శ్రీదేవసేనను కమిటీ ఛైర్‌పర్సన్‌గా ప్రభుత్వం నియమించింది. రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజీవ్‌గాంధీ హనుమంతు, జనగామ జిల్లా కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా, సంబంధిత జిల్లాల కలెక్టర్లు కమిటీలో సభ్యులుగా ఉంటారు. ప్రభుత్వ, ఎసైన్డ్, సీలింగ్, భూదాన్, ఇనాం, జాగీర్, అటవీ భూములతో పాటు భూసేకరణ, పునరావాసం, నీటి వనరుల పరిధిలోని ఆక్రమణలు, భూ రికార్డుల్లో అక్రమాలపై విచారణ జరగనుంది. అవసరమైన రికార్డులు, పత్రాలు, సమాచారాన్ని వివిధ ప్రభుత్వ శాఖలు, కలెక్టరేట్లు, స్థానిక సంస్థల నుంచి సేకరించే అధికారం కమిటీకి ఉంది. ఉల్లంఘనలు నిర్ధారణ అయితే బాధ్యతను గుర్తించి తగిన చర్యలకు సిఫార్సులు చేయడంతో పాటు, అవసరాన్ని బట్టి మధ్యంతర నివేదికలను కూడా సమర్పించనుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!