

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు 2026లో ఈసారి సంచలన ఫలితాలు వెలువడ్డాయి. ఎన్నోసార్లు విజయం సాధించిన రాజకీయ దిగ్గజాలు ఘోర పరాజయాలను చవిచూశారు. మాజీ ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ టీవీకే అభ్యర్థి వి.ఎస్. బాబు చేతిలో 8,795 ఓట్ల తేడాతో ఓడిపోవడం అతిపెద్ద షాక్‌గా మారింది. పోస్టల్ బ్యాలెట్ నుంచే వెనుకబడిన స్టాలిన్ 17 రౌండ్లలో ఒక్కసారి కూడా ఆధిక్యంలోకి రాలేకపోయారు. శాసనసభ స్పీకర్ అప్పావు రాధాపురంలో టీవీకే అభ్యర్థి సతీష్ క్రిష్టఫర్ చేతిలో ఓటమిపాలయ్యారు. డీఎంకే సీనియర్ నేత దురై మురుగన్ కాట్పాడిలో మూడో స్థానానికి పడిపోవడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది.
మరోవైపు పలువురు అన్నాడీఎంకే సీనియర్ నేతలు, మాజీ మంత్రులు కూడా ఈ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయారు. మంత్రి కె.ఆర్. పెరియకరుప్పన్ ఒక్క ఓటు తేడాతో పరాజయం చెందడం ఉత్కంఠ రేపింది. మాజీ మంత్రి డి. జయకుమార్ మూడో స్థానంలో నిలిచి డిపాజిట్ కోల్పోయారు. సెల్లూర్ రాజు, పి.తంగమణి, ఆర్.బి.ఉదయకుమార్, ఓ.కె.చిన్నరాజ్, ఎస్.రవి వంటి హ్యాట్రిక్ విజేతలు కూడా ఓటమి చవిచూశారు. అనేక నియోజకవర్గాల్లో టీవీకే అభ్యర్థులు సంచలన విజయాలు నమోదు చేయడంతో తమిళనాడు రాజకీయాల్లో పెద్ద మార్పు సంకేతాలు కనిపిస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!