

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ఉపయోగిస్తున్న పదజాలం, కేసీఆర్ పై చేస్తున్న వ్యాఖ్యలు అనుచితంగా మారుతున్నాయని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు నీళ్లు సహా కీలక అంశాల పై సమాధానాలు చెప్పలేక సీఎం మాటల స్థాయిని దిగజార్చుతున్నారని మండిపడ్డారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు దోసల అనీల్రెడ్డి, ఆయన అనుచరులు తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో భారత రాష్ట్ర సమితి లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ తనకు సీఎంను తిట్టాలనే ఉద్దేశం లేదని, కానీ తెలంగాణ సాధించిన, రెండుసార్లు సీఎంగా పనిచేసిన తన తండ్రి పై దూషణలు చేస్తే ఆవేశం రాక మానదని అన్నారు.
ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి ఓపికతో వ్యవహరిస్తున్నానని చెప్పిన కేటీఆర్, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్లో కూడా రేవంత్ రెడ్డి ని గెలవనీయబోమని సవాలు విసిరారు. మళ్లీ కేసీఆర్నే సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు.
హామీల అమలు గురించి ప్రశ్నించిన వారిని బెదిరించడం సరికాదని, హామీలు అమలు చేస్తానని శపథం చేయాల్సింది పోయి వ్యక్తిగత విమర్శలకు దిగడం తగదని కేటీఆర్ అన్నారు. తాను హైదరాబాద్ గల్లీలో పెరిగిన వ్యక్తినని, అనేక భాషల్లో ఘాటుగా మాట్లాడగల సామర్థ్యం ఉన్నప్పటికీ సీఎం పదవికి గౌరవం ఇచ్చి మౌనంగా ఉన్నానని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఒక ప్రెస్మీట్ పెట్టగానే సీఎం ఎందుకు ఆందోళనకు గురయ్యారని కూడా ప్రశ్నించారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!