

ఆంధ్రప్రదేశ్‌లో గనుల అక్రమ తవ్వకాలు, ఖనిజాల రవాణాను అరికట్టేందుకు అప్పటి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం 2020 జూలై 1న జీవో 35ను జారీ చేసింది. దీని ద్వారా ఏపీ మైనర్ మినరల్ కన్సెషన్ రూల్స్‌లో మార్పులు చేసి, అక్రమ మైనింగ్‌కు పాల్పడేవారిపై భారీ జరిమానాలు విధించే నిబంధనలను తీసుకొచ్చింది. ఈ జీవోను సమర్థిస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అంజనీ స్టోన్ క్రషర్ దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చీ, జస్టిస్ వి. మోహనలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం కొట్టివేసింది.
అనకాపల్లి జిల్లా మార్టూరు ప్రాంతంలో అనుమతులకు మించి కంకర, గ్రావెల్ తవ్వినట్లు ఆరోపణలు రావడంతో అంజనీ స్టోన్ క్రషర్ సంస్థకు గనుల శాఖ రూ.4.5 కోట్లు, రూ.9.96 కోట్ల జరిమానా నోటీసులు జారీ చేసింది. వీటిని సవాలు చేస్తూ సంస్థ న్యాయస్థానాలను ఆశ్రయించింది. అక్రమ మైనింగ్ సమాజానికి తీవ్రమైన సమస్య అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. నిబంధనల ప్రకారం రాష్ట్ర అధికారులు ఆర్థిక జరిమానాలు విధించవచ్చని హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. అయితే క్రిమినల్ శిక్షలు విధించే అధికారం సంబంధిత న్యాయస్థానాలకే ఉంటుందని స్పష్టం చేసింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!