

2023లో బీఆర్‌ఎస్ తరఫున ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలిచి, 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ నుంచి పోటీ చేసిన దానం నాగేందర్ అనర్హత వ్యవహారంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. తెలంగాణ హైకోర్టు సెప్టెంబర్ 18న ఇచ్చిన అనర్హత తీర్పులో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మల్య బాగ్చి, జస్టిస్ వి. మోహనలతో కూడిన ధర్మాసనం దానం దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. హైకోర్టు తీర్పు రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌ను సరిగ్గా వర్తింపజేసిందని ధర్మాసనం పేర్కొంది.
దానం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదిస్తూ.. పార్టీని వీడిన సభ్యుడిని తిరిగి పార్టీలో చేర్చుకుంటే ‘ఘర్ వాపసీ’గా పరిగణించి అనర్హత నుంచి మినహాయింపు ఇవ్వొచ్చని పేర్కొన్నారు. అయితే ధర్మాసనం ఈ వాదనతో విభేదించింది. పదో షెడ్యూల్‌లోని పేరా 2(1)(బి)లోని మినహాయింపు, పార్టీ ఆదేశాలకు వ్యతిరేకంగా ఓటు వేయడం లేదా ఓటింగ్‌కు గైర్హాజరు కావడం వంటి అంశాలకు వర్తిస్తుందని, పార్టీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకోవడాన్ని ఉద్దేశించిన పేరా 2(1)(ఎ)కు అది వర్తించదని స్పష్టం చేసింది. దీంతో దానం నాగేందర్ అనర్హతపై హైకోర్టు ఇచ్చిన తీర్పు కొనసాగనుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!