

కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తన ఆత్మకథ బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్లో భారత రాజకీయాలకు సంబంధించిన పలు కీలక విషయాలను వెల్లడించారు. ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీలోని సిండికేట్ నేతలతో ఆమెకు ఎదురైన విభేదాలు, మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డితో నెలకొన్న రాజకీయ సంఘర్షణలను వివరించారు. కామరాజ్, నిజలింగప్ప, నీలం సంజీవరెడ్డి తదితర నేతల ఒత్తిడితో మొరార్జీ దేశాయ్‌ను ఆర్థిక మంత్రిగా, ఉప ప్రధానిగా ప్రకటించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. 1969 రాష్ట్రపతి ఎన్నికల్లో సిండికేట్ సంజీవరెడ్డికి మద్దతు ప్రకటించడం, ఇందిరా గాంధీ 14 ప్రైవేటు బ్యాంకులను జాతీయం చేయడం, వీవీ గిరిని స్వతంత్ర అభ్యర్థిగా బలపరచడం వంటి పరిణామాలను ప్రస్తావించారు. అలాగే 1975లో అలహాబాద్ హైకోర్టు ఇందిరా గాంధీపై ఇచ్చిన తీర్పుకు ముందు జయప్రకాశ్ నారాయణ్ నీలం సంజీవరెడ్డికి పంపినట్లు చెప్పబడుతున్న సందేశం గురించి కూడా తన పుస్తకంలో వివరించారు.
తన రాజకీయ ప్రస్థానంలోని కీలక ఘట్టాలను కూడా సోనియా గాంధీ ఈ ఆత్మకథలో ప్రస్తావించారు. 1999లో అమేఠీతో పాటు కర్ణాటకలోని బళ్లారి నుంచి పోటీ చేయడం, BJP నేత సుష్మా స్వరాజ్‌తో జరిగిన ఎన్నికల పోరును గుర్తుచేసుకున్నారు. 2004 సాధారణ ఎన్నికలకు ముందు యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (యూపీఏ) ఏర్పాటులో ఎదురైన సవాళ్లను వివరించారు. ముఖ్యంగా డీఎంకేతో పొత్తు విషయంలో తొలుత ఎదురైన సందేహాలు, కరుణానిధితో చర్చలు, ఇతర ప్రాంతీయ పార్టీల నేతలతో జరిపిన సంప్రదింపులను వెల్లడించారు. షాబానో కేసులో అప్పటి ప్రధాని, తన భర్త రాజీవ్ గాంధీ నిర్ణయాన్ని తాను ప్రశ్నించిన విషయాన్ని కూడా గుర్తుచేశారు. ప్రస్తుత మోదీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, ఓటర్ల జాబితాల్లో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు. భవిష్యత్తు తరాలు ప్రజాస్వామ్య విలువలు, న్యాయం కోసం పోరాడి దేశ ఆత్మను పునరుద్ధరిస్తాయనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!