

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా స్వదేశానికి తిరిగి వస్తే మరణశిక్షను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆ దేశ ప్రాసిక్యూటర్ మహ్మద్ అమీనుల్ ఇస్లాం హెచ్చరించారు. ఆమెకు విధించిన మరణశిక్షపై అప్పీల్ చేసుకునే గడువు ముగిసిపోయిందని పేర్కొన్నారు. 2024లో విద్యార్థుల ఆందోళనలపై జరిగిన అణచివేతకు సంబంధించి మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై, 2025 నవంబర్‌లో బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ హసీనాకు మరణశిక్ష విధించింది. అయితే, ఈ ఆరోపణలను ఆమె ఖండించడంతో పాటు, తన గైర్హాజరీలో జరిగిన విచారణ నిష్పాక్షికంగా సాగలేదని అభ్యంతరం వ్యక్తం చేశారు.
2024 ఆగస్టులో విద్యార్థి ఉద్యమం తీవ్రరూపం దాల్చడంతో ప్రధాని పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనా దేశం విడిచి భారత్‌కు వచ్చారు. అప్పటి నుంచి ఆమె భారత్‌లోనే ఉంటున్నారు. డిసెంబర్‌లో బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లి కోర్టు ఎదుట లొంగిపోతానని గతంలో ప్రకటించారు. అయితే, ఆమెను అప్పగించాలని ఢాకా ప్రభుత్వం పట్టుబడుతోంది. అవసరమైన అధికారిక ప్రక్రియలు పూర్తయిన తర్వాత తిరుగు ప్రయాణ తేదీని వెల్లడిస్తామని హసీనా సహాయకులు తెలిపారు. కొత్త పాస్‌పోర్టు, గుర్తింపు కార్డు కోసం చేసిన విజ్ఞప్తులపై బంగ్లాదేశ్ రాయబార కార్యాలయం నుంచి ఇంకా అధికారిక స్పందన రాలేదు. ఈ నేపథ్యంలో హసీనా తిరుగు ప్రయాణంపై ఉత్కంఠ నెలకొంది.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!