

రాష్ట్రంలో వైసీపీ పాలనపై రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. జగన్‌రెడ్డి ఐదేళ్ల పాలనలో లిక్కర్ మాఫియాతో కలిసి నాసిరకం మద్యం తయారు చేసి రాష్ట్ర ఆదాయాన్ని దెబ్బతీశారని ఆమె ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం దుద్దుకూరులో నిర్వహించిన ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా జరిగిన రచ్చబండ కార్యక్రమంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
షర్మిల మాట్లాడుతూ వైసీపీ పాలనలో రాష్ట్రానికి కంటైనర్లలో డ్రగ్స్ వచ్చాయని, రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు సులభంగా లభించే పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. అధికారంలోకి వస్తే మోదీని ఒత్తిడి చేసి ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా తెస్తానని చెప్పిన జగన్, ఇప్పుడు బీజేపీకి దగ్గరయ్యారని విమర్శించారు. మూడు రాజధానుల పేరుతో రాష్ట్రానికి ఒక్క రాజధాని కూడా లేకుండా చేశారని కూడా అన్నారు.
అలాగే పోలవరం ఎత్తు తగ్గిస్తూ దాన్ని బలహీనపరుస్తున్నారని, దీనిపై ఎవరూ మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఉపాధి హామీ పథకంపై కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను ఎందుకు అడ్డుకోవడం లేదని కూడా అడిగారు. కాంగ్రెస్ పార్టీ మహిళలకు ప్రాధాన్యం ఇస్తుందని, రాజకీయ పదవుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు జేడీ శీలం, బోడా వెంకట్, మార్టిన్ లూధర్, టీకే విశ్వేశ్వరరెడ్డి, గిడుగు రుద్రరాజు, కే ప్రభాకరరావు, కాకర్ల శ్రీహరిబాబు తదితరులు పాల్గొన్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!