

ఓట్ల గల్లంతుపై మంత్రి పొన్నం ప్రభాకర్ విసిరిన సవాల్‌ను స్వీకరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు స్పష్టం చేశారు. ఓట్లు తొలగించబడ్డాయని ఆరోపిస్తున్న కనీసం పది మందిని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వద్దకు తీసుకురావాలని మంత్రికి సూచించారు. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, మంత్రి పొన్నం ప్రభాకర్ తనతో పాటు అసదుద్దీన్ ఒవైసీ, అక్బరుద్దీన్ ఒవైసీలను కూడా తీసుకురావాలని అన్నారు. కంప్యూటర్ రికార్డులను పరిశీలించి, నోటీసులు ఇవ్వకుండా, విచారణ చేపట్టకుండా ఏ ఒక్క ఓటును కూడా తొలగించలేదని నిరూపిస్తానని పేర్కొన్నారు. అర్హులైన ఓట్లు తొలగించినట్లు తేలితే నిబంధనల ప్రకారం అక్కడికక్కడే వాటిని తిరిగి నమోదు చేయాలని, లేదంటే మంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించకుండా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిల్లీలో రాహుల్‌గాంధీ సమావేశానికి వెళ్లడంపై రామచందర్‌రావు విమర్శలు చేశారు. గోవాలో నిర్వహించిన కాంగ్రెస్ యాత్ర సందర్భంగా బీజేపీను రావణుడితో, కాంగ్రెస్‌ను రాముడితో సీఎం పోల్చడాన్ని ప్రస్తావిస్తూ, రాజకీయాల కోసం దేవుళ్ల పేర్లను ఉపయోగించడం మానుకోవాలని హితవు పలికారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసే వరకు రాహుల్‌గాంధీని తెలంగాణలో అడుగుపెట్టనివ్వబోమని హెచ్చరించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!