

రాజకీయ పరిణామాలు తమ కుటుంబంపైనే కాకుండా చిన్నారులైన రాహుల్, ప్రియాంకలపైనా తీవ్ర ప్రభావం చూపాయని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ గుర్తుచేసుకున్నారు. తన ఆత్మకథ బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్లో ఈ విషయాలను ప్రస్తావించారు. 1977 లోక్‌సభ ఎన్నికల్లో ఇందిరా గాంధీ ఓడిపోయిన తర్వాత అప్పటివరకు తమ కుటుంబంతో సన్నిహితంగా ఉన్న చాలామంది క్రమంగా దూరమయ్యారని తెలిపారు. ఆ ఏడాది రాహుల్ ఏడో పుట్టినరోజు సందర్భంగా ఇంట్లో చిన్న పార్టీ ఏర్పాటు చేసి, అతడి స్నేహితులను ఆహ్వానించామని పేర్కొన్నారు. అయితే, రాహుల్ సన్నిహిత మిత్రుడు సిద్ధార్థ్ మాత్రమే వచ్చాడని, మిగతా పిల్లలు రాకపోవడంతో తొలుత ఏదైనా పొరపాటు జరిగిందేమోనని భావించి వారి తల్లిదండ్రులకు ఫోన్ చేశామని వివరించారు. అప్పుడు కొందరు ఉద్దేశపూర్వకంగానే తమ పిల్లలను ఇంటికి పంపలేదని తెలిసి బాధపడ్డామని రాసుకొచ్చారు. ఈ ఘటన ఏడేళ్ల రాహుల్‌ను తీవ్రంగా కలచివేసిందని, మానవ సంబంధాల విషయంలో అతడు ఎదుర్కొన్న తొలి బాధాకరమైన అనుభవంగా మిగిలిపోయిందని సోనియా పేర్కొన్నారు. పాఠశాలలోనూ ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలపై తోటి విద్యార్థులు చేసిన వ్యాఖ్యలు రాహుల్, ప్రియాంకలను బాధించేవని గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో కుటుంబం దేశం కోసం చేసిన సేవలను వారికి వివరించి ఓదార్చానని తెలిపారు. 1978 నవంబర్‌లో చిక్కమగళూరు ఉప ఎన్నికలో ఇందిరా గాంధీ విజయం సాధించిన తర్వాత పరిస్థితుల్లో మార్పు వచ్చిందని పేర్కొన్నారు.
1980 జూన్ 23న విమాన ప్రమాదంలో సంజయ్ గాంధీ మరణించిన ఘటనను కూడా సోనియా తన పుస్తకంలో భావోద్వేగంగా వివరించారు. వేసవి సెలవుల సందర్భంగా తాను, రాజీవ్, పిల్లలతో కలిసి ఇటలీ వెళ్లామని, రాహుల్, ప్రియాంకలను ఓర్బాస్సానోలోని తన తల్లిదండ్రుల వద్ద ఉంచి తామిద్దరం ఫ్లోరెన్స్‌కు వెళ్లామని తెలిపారు. ప్రమాదం జరిగిన రోజు దిల్లీ నుంచి తన తల్లికి ఫోన్ వచ్చిందని, అవతలి వ్యక్తి చెప్పిన విషయం అర్థం కాకపోవడంతో ఆమె ఫోన్‌ను పదేళ్ల రాహుల్‌కు ఇచ్చారని రాశారు. ఇందిరా గాంధీ వ్యక్తిగత కార్యదర్శి ఆర్.కె. ధావన్ ఫోన్‌లో సంజయ్ విమాన ప్రమాదంలో మరణించినట్లు రాహుల్‌కు తెలియజేశారు. ఆ వార్తను నమ్మలేకపోయిన రాహుల్ కన్నీళ్లు పెట్టుకుంటూ తన బాబాయ్ చనిపోయాడని ఇటాలియన్ భాషలో పదేపదే చెప్పాడని సోనియా గుర్తుచేసుకున్నారు. ఈ వార్తతో రాజీవ్ కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారని, వారిద్దరినీ ఓదార్చడం కష్టమైందని తెలిపారు. తగిన ప్రాథమిక శిక్షణ లేకుండా విమానం నడపవద్దని రాజీవ్ ముందుగానే సంజయ్‌ను హెచ్చరించినట్లు కూడా ఆమె రాశారు. సంజయ్ మరణించే సమయానికి ఆయన భార్య మేనకా గాంధీకి 23 ఏళ్లని, కుమారుడు వరుణ్‌కు కేవలం మూడు నెలల వయసని పేర్కొన్నారు. ఈ విషాదం తమ కుటుంబానికి తీరని లోటుగా మిగిలిపోయిందని సోనియా తన ఆత్మకథలో వివరించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!