
.jpg&w=3840&q=75)
పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని 2027 మార్చి నెలాఖరుకు పూర్తిచేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. తొలి దశలో 119 టీఎంసీల నీటిని నిల్వ చేసి, కుడి మరియు ఎడమ కాలువల ద్వారా గ్రావిటీ పద్ధతిలో నీటిని సరఫరా చేస్తామని వెల్లడించారు.
బుధవారం పోలవరం ప్రాజెక్టును ముఖ్యమంత్రి ప్రత్యక్షంగా సందర్శించారు. అక్కడ కొనసాగుతున్న నిర్మాణ పనులను సమగ్రంగా పరిశీలించిన అనంతరం, జలవనరుల శాఖ అధికారులు, పునరావాస విభాగం, జిల్లా కలెక్టర్లు, ఎమ్మెల్యేలు మరియు మంత్రులతో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, పోలవరం కుడి కాలువ పనులు దాదాపుగా పూర్తయ్యాయని, ఎడమ కాలువ పనులను ఈ ఏడాది మార్చి నెలాఖరులోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. తొలి దశ పునరావాసంలో భాగంగా 38,060 నిర్వాసిత కుటుంబాలకు ప్యాకేజీ ఇవ్వడంతో పాటు కాలనీలు నిర్మించి తరలించాల్సి ఉందని, ఈ ప్రక్రియను ఈ ఏడాది చివరి నాటికి పూర్తిచేస్తామని స్పష్టం చేశారు.
ముందుగా నిర్మించిన డయాఫ్రం వాల్ దెబ్బతినడంతో, దానిని పక్కనపెట్టి కొత్తగా రూ.1,000 కోట్ల వ్యయంతో డయాఫ్రం వాల్ నిర్మిస్తున్నామని, ప్రస్తుతం 87 శాతం పనులు పూర్తయ్యాయని, ఫిబ్రవరి నెలలోనే అది పూర్తవుతుందని తెలిపారు.
కుడి–ఎడమ అనుసంధాన టన్నెల్లు, నావిగేషన్ కాలువ పనులను ఈ ఏడాది జూన్ నాటికి, గ్యాప్–1 ప్రధాన డ్యాం పనులను జూన్ చివరికి, గ్యాప్–2 ప్రధాన డ్యాం నిర్మాణాన్ని 2027 మార్చికి పూర్తిచేస్తామని వివరించారు.
ఎడమ, కుడి కాలువల ద్వారా అన్ని రిజర్వాయర్లు, చెరువులు, జలాశయాలు నిండేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే అదనపు స్లూయిస్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. పునరావాస పనులకు నెలవారీ లక్ష్యాలతో స్పష్టమైన ప్రణాళిక ఇవ్వాలని, దాని అమలును తానే పర్యవేక్షిస్తానని సీఎం తెలిపారు.
పోలవరం డ్యాం పరిసరాల్లో 9,000 ఎకరాల్లో పర్యాటక ప్రాజెక్టు అభివృద్ధి పై జపాన్ కన్సల్టెన్సీ సంస్థ ఇచ్చిన ప్రజెంటేషన్‌ను సీఎం పరిశీలించారు. అలాగే స్పిల్‌వే సుందరీకరణను భారతీయ సాంస్కృతిక సంప్రదాయాలకు అనుగుణంగా రూపొందించాలని సూచించారు. ఐకానిక్ బ్రిడ్జి పనులకు టెండర్లు పిలవాలని ఆదేశించారు.
నావిగేషన్, ఇన్‌ల్యాండ్ వాటర్‌వేలను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలని, కాకినాడ పోర్టు వరకు జలరవాణా సౌకర్యం కల్పించేలా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా జలరవాణా జరిగేలా ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు.
నదుల అనుసంధానం తన దీర్ఘకాలిక లక్ష్యమని సీఎం పునరుద్ఘాటించారు. వంశధార, గోదావరి, కృష్ణా, పెన్నా నదులను అనుసంధానించడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను కరవు రహిత రాష్ట్రంగా మార్చడమే తన స్వప్నమని తెలిపారు. అంతర్గత నదుల అనుసంధానానికి ప్రధాని అనుమతి లభించిందని వెల్లడించారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!