

రాష్ట్రంలో జిల్లాల విభజన, డివిజన్ల విభజన, అలాగే కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం వేగంగా వ్యూహరచన చేస్తోంది. అయితే ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి ఇంకా మరో 30 రోజులు మాత్రమే గడువు ఉంది. ఈ సంవత్సరం డిసెంబర్ 20లోపు కొత్త జిల్లాల సరిహద్దులు లేదా డివిజన్ల సరిహద్దులను ఖరారు చేయాల్సి ఉంది.
డిసెంబర్ 21 తర్వాత జిల్లాలు, మండలాలు, డివిజన్ల సరిహద్దుల్లో మార్పులకు అవకాశం లేదని కేంద్ర గణాంక శాఖ ఇప్పటికే స్పష్టం చేసింది.
దాంతో, జిల్లాల విభజనపై ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయాలకు చాలా తక్కువ సమయం మాత్రమే మిగిలి ఉంది. అయితే ఇప్పటికీ చాలా జిల్లాల్లో విభజన, మండలాల సరిహద్దుల మార్పులపై వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి.
ప్రభుత్వం మార్కాపురం, మదనపల్లె జిల్లాలను కొత్త జిల్లాలుగా ప్రకటించినప్పటికీ, అక్కడి ప్రజలు అనేక మార్పులు చేయాలని కోరుతున్నారు. ఇదే సమయంలో రాజంపేటను కూడా జిల్లాగా ప్రకటించాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది.
ఈ డిమాండ్ రాజకీయంగా కూడా కీలకం. ఉమ్మడి కడప జిల్లాలో ముఖ్యమైన రాజంపేట నియోజకవర్గంలో గత ఎన్నికల్లో టిడిపి విజయం సాధించింది. రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటిస్తే, కడప జిల్లాలో రాజకీయ సమీకరణాలు మార్చే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది. కానీ ఈ విషయంపై ఇంకా ఏ ప్రక్రియ ప్రారంభం కాలేదు.
అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాలో భాగాన్ని కొత్త జిల్లాగా ఏర్పాటు చేయడం, కొన్ని జిల్లాల పేర్లు మార్చడం వంటి అంశాలు కూడా పెండింగ్లో ఉన్నాయి. ఇప్పటివరకు దాదాపు 2,000 పైగా విన్నపాలు అధికారుల వద్ద పెండింగ్లో ఉన్నాయని తెలుస్తోంది.
ప్రస్తుతం సీఎం చంద్రబాబు అత్యంత బిజీ షెడ్యూల్లో ఉండగా, త్వరలో ఢిల్లీ పర్యటన, అనంతరం శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ఉండటంతో, జిల్లాల విభజనకు ఆయన ఎంత సమయం కేటాయిస్తారన్నది ప్రశ్న. ఈ ప్రక్రియను నిర్లక్ష్యంగా నిర్వహిస్తే, వైసీపీ ప్రభుత్వంలో జరిగినట్టు సమస్యలు మళ్లీ ఎదురయ్యే ప్రమాదం ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది.
ఇక ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకుంటుందో, వచ్చే రోజులలో స్పష్టత రావాల్సి ఉంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!