

హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో భారత్ సమ్మిట్‌పై నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడారు. భారత్ సమ్మిట్‌ను రాజకీయ కోణంలో చూడకూడదని, ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కార మార్గాలను అన్వేషించడమే సదస్సు ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. ఈ సదస్సు ఆర్థిక సమావేశం తరహాలో ఉపయోగపడుతుందని, యువత, సాంకేతికత సహా పలు కీలక అంశాలపై చర్చలు జరుగుతాయని తెలిపారు. ముఖ్యంగా జెన్‌జీ యువత లేవనెత్తుతున్న అంశాలపై మేధోపరమైన చర్చలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
రాహుల్ గాంధీని రీలాంచ్ చేయడానికే భారత్ సమ్మిట్ నిర్వహిస్తున్నారంటూ బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలను శ్రీధర్ బాబు ఖండించారు. రాహుల్ గాంధీకి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉందని, ఆయనను ప్రత్యేకంగా మరోసారి పరిచయం చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. మోదీ తర్వాత ఎవరిని లాంచ్ చేయాలని బీజేపీ ఆలోచిస్తోందంటూ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రగతిశీల ఆలోచనలతో ముందుకు సాగుతోందని, బీజేపీ భావజాలం భిన్నంగా ఉంటుందని పేర్కొన్నారు. అలాగే ఎస్‌ఐఆర్ పేరుతో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యల ప్రజాస్వామిక ప్రభావాలపైనా సదస్సులో చర్చిస్తామని తెలిపారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!