

మునిసిపల్ ఎన్నికల ఫలితాల పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. తమ పార్టీ శ్రేణులు గట్టి పోటీ ఇచ్చాయని ఆయన పేర్కొన్నారు. సుమారు 30 కి పైగా మునిసిపాలిటీలు గెలుస్తామని అంచనా వేసినా, ప్రస్తుతం 17 చోట్ల విజయాన్ని సాధించామని తెలిపారు. హంగ్ పరిస్థితి ఏర్పడిన మునిసిపాలిటీల్లో కూడా తమకు గెలిచే అవకాశాలు ఉన్నాయని విశ్వాసం వ్యక్తం చేశారు.
అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికంగా ఖర్చు చేసినప్పటికీ, ఆశించిన స్థాయిలో స్థానాలు గెలవలేకపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. ఫలితాల పై కాంగ్రెస్లో అసంతృప్తి నెలకొన్నదని చెప్పారు.
బీజేపీ విషయానికి వస్తే, జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వంటి నాయకులు ప్రచారం చేసినప్పటికీ ఒక్క మునిసిపాలిటీని కూడా ఆ పార్టీ గెలుచుకోలేకపోయిందని కేటీఆర్ విమర్శించారు. గత ఎన్నికలతో పోలిస్తే సీట్లు, ఓట్లు తగ్గినా బీజేపీ సంతోషపడుతోందని ఆయన ఎద్దేవా చేశారు.
పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్పై విమర్శలు చేసిన వారికి ఈ ఫలితాలే సమాధానం ఇచ్చాయని పేర్కొన్నారు. తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ కేవలం నాలుగు మునిసిపాలిటీల్లో మాత్రమే గెలిచిందని గుర్తు చేశారు.
ఎక్స్ అఫీషియో సభ్యుల నిబంధనల విషయంలో స్పష్టత లేకపోవడాన్ని ఆయన ప్రశ్నించారు. కలెక్టర్లు ఒక విధంగా, సీఎస్ మరో విధంగా మాట్లాడుతున్నారని, ప్రభుత్వం కూడా స్పష్టమైన వైఖరి తెలియజేయలేకపోయిందని విమర్శించారు.
ఫార్ములా-ఈ రేసు కేసును ప్రభుత్వం మళ్లీ తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఇప్పటికే నాలుగు సార్లు విచారణకు హాజరయ్యానని, దానితో పోలీసులు సాధించినది ఏమీ లేదని అన్నారు. మరోసారి పిలిస్తే కూడా హాజరవుతానని, అవసరమైతే జైలుకెళ్లడానికైనా సిద్ధమేనని కేటీఆర్ స్పష్టం చేశారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!