

టెలిఫోన్ ట్యాపింగ్ కేసు పేరుతో మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్‌కు సిట్ నోటీసులు జారీ చేయడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఈ విచారణ ప్రక్రియ మొత్తం ఒక “అట్టర్ ఫ్లాప్ టీవీ సీరియల్”ను తలపిస్తోందని ఆయన విమర్శించారు. అసలు బాధ్యులైన అధికారులను వదిలేసి, కేసుతో ఎలాంటి సంబంధం లేని ప్రతిపక్ష నాయకులను వరుసగా విచారణకు పిలవడం పూర్తిగా రాజకీయ కక్షసాధింపుతో పాటు అటెన్షన్ డైవర్షన్‌లో భాగమని అన్నారు. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల ముందు ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ డ్రామా నడుపుతోందని కేటీఆర్ ఆరోపించారు.
రాష్ట్రంలో కొనసాగుతున్న భారీ అవినీతి, కుంభకోణాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిట్ విచారణను ఒక ఆయుధంలా ఉపయోగిస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. నైని బొగ్గు గనుల కుంభకోణం బయటపడటంతో ప్రభుత్వం తీవ్ర ఒత్తిడిలో పడిందని, దాన్ని పక్కదారి పట్టించేందుకే ఈ నోటీసుల నాటకం సాగుతోందన్నారు. గతంలో హరీష్ రావు, తనను కూడా ఇదే కేసులో విచారించినా ఎలాంటి ఫలితం లేదని, ఇప్పుడు సంతోష్ కుమార్‌ను లక్ష్యంగా చేసుకున్నారని విమర్శించారు. రాజ్‌భవన్‌కు వెళ్లి బొగ్గు కుంభకోణంపై గవర్నర్‌కు వినతిపత్రం ఇస్తామని ప్రకటించిన వెంటనే నోటీసులు రావడం యాదృచ్ఛికం కాదని తెలిపారు. సంతోష్ కుమార్‌కు పార్టీ పూర్తిగా అండగా ఉంటుందని, ఈ అక్రమ కేసులను న్యాయస్థానాల్లో ఎదుర్కొంటామని కేటీఆర్ స్పష్టం చేశారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!