

సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదిత అమెరికా పర్యటనపై కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీతో సీఎం ఎందుకు భేటీ కావాలనుకున్నారో వివరించాలని ప్రశ్నించారు. మంగళవారం దిల్లీలో విలేకరులతో మాట్లాడిన కిషన్ రెడ్డి.. రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు విదేశాంగ శాఖ అనుమతి ఇవ్వకపోవడం రాజకీయ నిర్ణయం కాదని, పూర్తిగా పరిపాలనా ప్రక్రియలో భాగమేనని స్పష్టం చేశారు. సీఎం పర్యటన షెడ్యూల్ ఆయన హోదాకు తగిన విధంగా లేదని విదేశాంగ శాఖ ముందుగానే స్పష్టం చేసిందని తెలిపారు. అవసరమైన అధికారిక క్లియరెన్స్ పొందకుండానే పర్యటనకు ప్రయత్నించి, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. గతంలో హార్వర్డ్ బిజినెస్ స్కూల్, లండన్ పర్యటనలకు అనుమతులు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు.
కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సమయంలోనూ పలువురు ముఖ్యమంత్రుల విదేశీ పర్యటనలకు అనుమతులు నిలిపివేసిన సందర్భాలు ఉన్నాయని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. తనకు కూడా గతంలో కెనడా, రష్యా పర్యటనలకు అనుమతులు రాలేదని చెప్పారు. విదేశీ యూనివర్సిటీలను రాష్ట్రానికి తీసుకొస్తామని చెబుతున్న సీఎం.. తెలంగాణ విద్యా వ్యవస్థను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. విద్యాశాఖకు 15 శాతం నిధులు కేటాయిస్తామన్న హామీతో పాటు విద్యార్థులకు స్కూటీలు, విద్యా భరోసా కార్డులు, ప్రతి మండలంలో అంతర్జాతీయ పాఠశాల ఏర్పాటు వంటి హామీలను ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు. మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కోయగూడెం బ్లాక్-3ను సింగరేణికి కేటాయించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోందని కిషన్ రెడ్డి తెలిపారు. గతంలో ప్రైవేట్ సంస్థకు కేటాయించిన ఈ బ్లాక్‌లో సకాలంలో బొగ్గు ఉత్పత్తి జరగకపోవడంతో టెండర్ రద్దు చేసి మళ్లీ వేలానికి తీసుకొచ్చామని చెప్పారు. పీకేవోసీ-2 బ్లాక్‌ను కూడా సింగరేణికి కేటాయించేలా చర్యలు తీసుకున్నామని, కోయగూడెం బ్లాక్-3లో గ్రేడ్-1 బొగ్గు ఉందని, దీని ద్వారా సుమారు 120 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయవచ్చని తెలిపారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!