

బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం పార్టీ ముఖ్య నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. నందినగర్‌లోని ఆయన నివాసంలో జరిగిన ఈ భేటీలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావుతో పాటు పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ నేతలకు దిశానిర్దేశం చేశారు.
తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాలు, ముఖ్యంగా పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్ అంశంపై అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీయాలని బీఆర్ఎస్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజల ముందుకు తీసుకెళ్లేలా చర్చకు సిద్ధం కావాలని నేతలకు సూచించారు.
అధికార కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పాలనలో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టి కేవలం కాళేశ్వరం ప్రాజెక్ట్‌పైనే దృష్టి పెట్టిందని విమర్శిస్తోంది. అధికార పార్టీ విమర్శల నేపథ్యంలో బీఆర్ఎస్ మాత్రం తమ పదేళ్ల పాలనలో కృష్ణా, గోదావరి నదులపై అనేక ప్రాజెక్టులు చేపట్టామని, నీటి వాటాలపై స్పష్టమైన చర్యలు తీసుకున్నామని వాదిస్తోంది.
ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ మధ్య ఈ అంశంపై జరిగిన మాటల యుద్ధం వ్యక్తిగత విమర్శల వరకు వెళ్లింది. ఈ పరిస్థితుల్లో అసెంబ్లీ సమావేశాలను పూర్తిగా ఉపయోగించుకుని ప్రభుత్వ ఆరోపణలకు సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ గట్టి నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ప్రభుత్వం చేసే ప్రతి వ్యాఖ్యకు సిద్ధంగా ఉండాలని ఇప్పటికే నేతలకు కేసీఆర్ సూచించినట్లు తెలుస్తోంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!