

కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు లక్ష్యంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన ప్రయత్నాలను మరింత వేగవంతం చేశారు. తెలంగాణ రాష్ట్ర పరిస్థితులు, సమగ్ర అభివృద్ధి, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటికి సాధ్యమైన పరిష్కారాలు, వనరుల వినియోగం వంటి అంశాలపై అధ్యయనం చేయడానికి ఇప్పటికే కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో కమిటీలు చేసిన అధ్యయన వివరాలను కవితకు వివరించి, ప్రాథమిక నివేదికను సమర్పించారు.
తెలంగాణ సమగ్ర అభివృద్ధికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించే పనిలో జాగృతి నాయకులు ప్రస్తుతం నిమగ్నమై ఉన్నారు. మరో రెండు నుంచి మూడు నెలల్లో కొత్త రాజకీయ పార్టీపై స్పష్టత వచ్చే అవకాశముందని జాగృతి వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌తో కవిత భేటీ అయినట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీ ఏర్పాటు, ప్రజా సమస్యలపై పోరాటం, ప్రజల కోణంలో రాజకీయాలు చేయడం వంటి అంశాలపై ఆయనతో చర్చించినట్లు సమాచారం. అయితే, ఈ భేటీపై జాగృతి వర్గాలు అధికారికంగా ఎలాంటి ధ్రువీకరణ ఇవ్వలేదు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!